Begin typing your search above and press return to search.

మూడు పార్టీలకు హ్యాపీయేనా ?

By:  Tupaki Desk   |   7 Dec 2020 2:30 AM GMT
మూడు పార్టీలకు హ్యాపీయేనా ?
X
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో చిత్ర విచిత్రమైన పరిస్ధితులు కనపించాయి. కచ్చితంగా ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అని స్పష్టంగా చెప్పే అవకాశం కనబడటం లేదు. ఎందుకంటే పోటీలో ఉన్న చాలా పార్టీలతో పోల్చి చూస్తే మూడు ప్రధాన పార్టీలు అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీల్లో మూడింటికి ప్లస్సులు, మైనస్సులున్నాయన్న విషయం అర్దమైపోతుంది. అంతకుమించి చూసుకుంటే ఏదో రకంగా మూడుపార్టీలకు సానుకూల ఫలితాలు రావటమన్నదే ఆశ్చర్యకరం.

మొదటగా టీఆర్ఎస్ విషయాన్ని చూస్తే గ్రేటర్ లో 99 డివిజన్లను చేతిలో పెట్టుకుని ఎన్నికలకు దిగింది. అయితే 56 డివిజన్లలో మాత్రమే గెలిచింది. అంటే 43 డివిజన్లను కోల్పోయింది. నిజంగా చూస్తే టీఆర్ఎస్ కు ఘోరమైన ఓటమిగానే చూడాలి. కానీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం అధికారపార్టీకే ఉంది. ఎక్స్ అఫీషియో ఓట్లరూపంలో టీఆర్ఎస్ కు అదనంగా 37 ఓట్లుండటం కలిసొచ్చేదే. కాబట్టి డివిజన్లు చేజారినా మేయర్ పీఠం మాత్రం నిలుపుకునే అవకాశం సజీవంగా ఉంది కాబట్టి హ్యాపీనే అనుకోవాలి.

ఇక ఎంఐఎం విషయానికి వస్తే ఓల్డ్ సిటిలో తమకు ఎదురేలేదనుకున్న పరిస్దితిల్లో బీజేపీ గట్టి పోటి ఇవ్వటం ఊహించనిదనే చెప్పాలి. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఎంఐఎం తరపున మెజారిటి డివిజన్లలో అభ్యర్ధులు ఇలా నామినేషన్లు వేస్తే అలా గెలిచిపోతున్నారు. కానీ మొదటిసారి గెలుపుకోసం చెమటోడ్చాల్సొచ్చింది. పైగా చాలా చోట్ల పార్టీలో అగ్రనేతలైన ఓవైసీ సోదరులను ప్రచారం చేయనీయకుండా జనాలు అడ్డకోవటం మరింత ఆశ్చర్యం. ఎంఐఎం పోటీ చేసిన 52 డివిజన్లలో 44 గెలిచింది. పోయిన ఎన్నికల్లో ఇన్నే డివిజన్లు గెలిచి తన పట్టు నిలుపుకుంది. కాకపోతే చాలా డివిజన్లలో బీజేపీ గట్టిపోటీ ఇవ్వటమన్నది మజ్లిస్ పార్టీకి డేంజర్ బెల్స్ అనే అనుకోవాలి.

చివరగా బీజేపీ విషయం చూస్తే 4 డివిజన్ల నుండి ఏకంగా 48 డివిజన్లను గెలుచుకోవటం మామూలు విషయం కాదు. గ్రేటర్ ఎన్నికల్లో ఒకేసారి ఇటు టీఆర్ఎస్ అటు ఎంఐఎం పార్టీలను వణికించేసింది. మేయర్ పీఠం తమదే అని కమలం నేతలు ఎంత చెప్పుకున్నా జనాలు నమ్మలేదు. కాకపోతే ఇన్ని డివిజన్లలో బీజేపీ గెలుస్తుందని ఎవరు ఊహించలేదు. ఇదే విధమైన దూకుడు ప్రదర్శిస్తే భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలో అయినా బీజేపీ మంచి ప్రభావం చూపటం ఖాయమనే చర్చలు జోరందుకుంటున్నాయి.

సో, గ్రేటర్ ఎన్నికల ఫలితల తర్వాత అర్ధమైనదేమంటే మేయర్ పీఠం నిలుపుకున్నందుకు టీఆర్ఎస్, పట్టునిలుపుకున్నందుకు ఎంఐఎం, 4 నుండి 48 డివిజన్లకు పెరిగిన కారణంగా బీజేపీ ఫుల్లు హ్యాపీగానే ఉన్నాయని. ఈ మొత్తం మీద బాగా దెబ్బతిన్న పార్టీలేవంటే ముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీ. ఎంఐఎం లాగే కాంగ్రెస్ కూడా తన పట్టు నిరూపించుకున్నదని జనాలు సెటైర్లు వేసుకుంటున్నారు.

ఎలాగంటే పోయిన ఎన్నికల్లోను, తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచింది 2 డివిజన్లే కాబట్టి. పోయిన ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఒక్క డివిజన్ కూడా ఈసారి మాయమైపోయింది. బహుశా సమీప భవిష్యత్తులో ఈ పార్టీలు గ్రేటర్ ఎన్నికల్లోనే కాదు ఏకంగా తెలంగాణా నుండే మాయమైపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.