Begin typing your search above and press return to search.

ఉద్యోగుల తొల‌గింపు కామ‌న్ అంటున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   16 May 2017 12:14 PM GMT
ఉద్యోగుల తొల‌గింపు కామ‌న్ అంటున్న కేటీఆర్‌
X
ఐటీలో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొల‌గింపు అంశం వివిధ వ‌ర్గాల్లో క‌ల‌వ‌రానికి కార‌ణంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రారంభం అయిన ఉద్యోగుల తొల‌గింపు రాబోయే కాలంలో భారీగా ఉండ‌నుంద‌నే వార్త‌లు క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ విష‌యాన్ని లైట్ తీసుకోవాల‌ని సూచిస్తున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. తాజాగా జరిగిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యోగులు తొల‌గింపును లైట్ తీసుకోవాల‌న్నారు. ఈ విష‌యంలో అన‌వ‌స‌ర ఆందోళ‌న వ‌ద్ద‌న్నారు.

ఐటీలో ఉద్యోగుల తొల‌గింపు ఇదే కొత్త కాద‌ని, ప్ర‌తి ఏటా ఉంటోంద‌ని కేటీఆర్ తెలిపారు. తొల‌గింపు అనే తాత్కాలిక ప్ర‌క్రియ‌కు ఐటీ ఉద్యోగులు నారాజ్ అవ్వొద్ద‌ని చెప్పిన కేటీఆర్ త్వ‌ర‌లో ఇదంతా స‌ర్దుకుంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఐటీ ఎగుమ‌తులు జ‌రుగుతున్నాయ‌ని తెలిపిన కేటీఆర్ ఈ ఏడాది సైతం త‌మ ఐటీ ఎగుమ‌తులు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో త‌న‌కు అన‌ధికార రిపోర్ట్ ఉంద‌ని తెలిపారు.

మ‌రోవైపు ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో ఉద్యోగుల తొల‌గింపు ప్ర‌హ‌స‌నం ఆటో మొబైల్ రంగానికి పాకింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకోవాలని ఫోర్డ్ మోటార్ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. లాభాలను పెంచడానికి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఫోర్డ్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాల కోత ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా టార్గెట్ శాలరీ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తారని న్యూస్ పేపర్ పేర్కొంది. అయితే గంటల లెక్కన పనిచేసే ఫ్యాక్టరీ వర్కర్లపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదని ఈ జర్నల్ వెల్లడించింది. ఫోర్డ్ కంపెనీలో రెండు లక్షల మందికి పైగానే ఉద్యోగులుండగా.. వారిలో లక్ష మందికి పైగా ఉద్యోగులు ఒక్క ఉత్తర అమెరికాలోనే ఉన్నారు. మ‌రోవైపు ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ ఫీల్డ్స్, స్టాక్ ధర వెనుకబాటును, లాభాల పెంపుకోసం తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఆ కథనంలో వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/