Begin typing your search above and press return to search.

వీరమరణం పొందిన జవాన్ మహేష్ ....ఏడాది క్రితమే పెళ్లి , విషాదంలో గ్రామస్థులు !

By:  Tupaki Desk   |   9 Nov 2020 4:30 PM GMT
వీరమరణం పొందిన జవాన్ మహేష్ ....ఏడాది క్రితమే పెళ్లి , విషాదంలో గ్రామస్థులు !
X
పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసే దాడుల్లో మన జవాన్లు తమ ప్రాణాలని తృణ ప్రాయంగా వదిలేస్తూ , దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆర్మీ లో చేరడం , దేశం కోసం బోర్డర్ లో వీర మరణం పొందుతుంటారు. దేశం కోసమే ప్రాణాలు వదిలినప్పటికీ, ఆ ప్రాణం ఇక ఎప్పటికి తిరిగిరాదు అని తెలిసిన క్షణంలో భాద వేయకమానదు. అయితే , ఎంతోమంది జవాన్లు పాకిస్థాన్ ఉగ్రవాదులని చంపేసే క్రమంలో వీరమరణం పొందుతున్నప్పటికీ, మన జవాన్లు వెన్ను చూపకుండా దేశం కోసం ప్రతిక్షణం గస్తీ పడుతున్నారు. అయితే , చుదువుకునే సమయంలో పెద్దయ్యాక ఏమవుతావని ఎవరైనా అడిగితే... చాలా మంది డాక్టర్ అనో టీచర్, లాయర్, యాక్టర్ ఇలా చెబుతారే తప్ప, ఆర్మీలో చేరతా అని చెప్పేవాళ్లు తక్కువే. కానీ, తాజాగా ముష్కరులు జరిపిన కాల్పుల్లో అమర జవాన్ మహేష్ మాత్రం... చిన్నప్పటి నుంచి అదే కలతో పెరిగాడు. సైనిక విధుల్లో దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు విడిచాడు.

వీరమరణం పొందిన వీర జవాన్ మహేష్‌ది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని కోమటిపల్లి గ్రామం. మహేష్ 6వ తరగతి వరకు వేల్పూర్‌ మండలం కుకునూర్‌ గవర్నమెంట్ స్కూల్లో, 7 నుంచి 10వ తరగతి వరకు వేల్పూర్‌ లోని జిల్లా పరిషత్‌ హై స్కూల్లో చదివాడు. నిజామాబాద్‌లోని శాంఖరి కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆరేళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న మహేష్, 2019 డిసెంబర్ ‌లో ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని పలకరించి వెళ్లాడు. అదే చివరి పలకరింపు. తాజాగా జరిగిన ఉగ్రదాడిలో మహేష్ అమర జవాన్ అవ్వడంతో కన్నీటి సంద్రమవుతున్నారు కుటుంబ సభ్యులు. దేశం కోసం ప్రాణాలు అర్పించడం గొప్ప విషయమే అయినా ఇక ఎప్పటికీ తిరిగి రాడనే వార్త వారిని తీవ్రంగా కలచివేస్తోంది. మహేష్ మరణవార్త విని గ్రామస్థులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

చిన్నప్పటి నుంచి మహేష్‌కి దేశభక్తి ఎక్కువే. ఆర్మీలో చేరాలనే ఆలోచనతోనే పెరిగాడు. ఇంటర్ చదివేటప్పుడే ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు. మహేశ్‌కు తల్లి ర్యాడ గంగు, తండ్రి గంగమల్లు, అన్న భూమేశ్‌ ఉన్నారు. 2014-15లో ఆర్మీకి సెలెక్ట్ అయిన మహేష్. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ కి చెందిన సుహాసినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల నుంచి ఆర్మీలో పనిచేస్తూ, దేశ రక్షణ లో పాలు పంచుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.

తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు చనిపోయారు. వారిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుకాగా, ఆ ఇద్దరిలో ఒకరు మహేష్. 26 ఏళ్ల వయసు, ఎంతో భవిష్యత్తు ఉంది. అంతలోనే అంతా అయిపోయింది. ఎంతో మంది జవాన్లు ఇలాగే, ప్రాణాలు అర్పించాల్సి వస్తోంది. ఇక, మహేష్ మృతిపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు. మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేం అని క్యాప్షన్ పెట్టారు. మహేష్ మృతిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అమర జవానుకు ఘన నివాళి అర్పించిన ఆమె... తెలంగాణ జాతి వీర జవాన్ కుటుంబానికి అండగా ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉగ్ర‌దాడిలో వీర‌మ‌ర‌ణం పొందిన రాడ్యా మ‌‌హేశ్‌కు ఐటీ మంత్రి కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. మ‌హేశ్ త్యాగం మ‌రువ‌లేనిది అని పేర్కొన్నారు. మ‌హేశ్ కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని కేటీఆర్ భ‌రోసానిచ్చారు.