Begin typing your search above and press return to search.

డ్రైవ‌ర్‌ లెస్ కారులో లోకేష్‌ షికారు

By:  Tupaki Desk   |   15 Dec 2017 7:41 AM GMT
డ్రైవ‌ర్‌ లెస్ కారులో లోకేష్‌ షికారు
X
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అక్కడ డ్రైవర్‌ లెస్ కారులో ప్రయాణించారు. శాన్‌ ఫ్రాన్సిస్‌ కోలో పర్యటిస్తున్న నారా లోకేశ్ .. డ్రైవర్ లేకుండా ప్రయాణించే కారులో ఓ ట్రిప్ వేశారు.డ్రైవ‌ర్ లెస్ కారు ప‌నితీరును ప్ర‌త్య‌క్షంగా తెలుసుకున్నారు. మ‌రోవైపు గూగూల్ సంస్థ‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ‌ప‌ట్ట‌ణంలో డెవ‌ల‌ప్‌ మెంట్ సెంట‌ర్‌ ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఎక్స్ అంగీక‌రించింది. ఈ నేప‌థ్యంలో మంత్రి లోకేశ్‌.. గూగుల్‌ కు చెందిన డ్రైవ‌ర్‌ లెస్ కారులో కాసేపు విహ‌రించారు.

ఇప్పటివరకూ అమెరికాలో తప్ప ఏ ఇతర దేశంలోనూ కార్యకలాపాలు సాగించని గూగుల్‌ ఎక్స్‌.. తాజా ఒప్పందం ద్వారా తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ కు రావడం విశేషం. విశాఖపట్టణంలో త్వరలో ఇది ఏర్పాటు చేయనున్నారు. అమెరికా పర్యటనలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో ప్రసిద్ధమైన సంస్థ గూగుల్‌ ఎక్స్‌ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీ ఐటీ శాఖ అధికారులు - గూగుల్‌ ఎక్స్‌ సీఈఓ అస్టో టెల్లర్‌ మధ్య ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ కు సంబంధించి ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ లో గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ను ప్రారంభించనున్నట్లు సమాచారం అందుతుంది. అత్యాధునిక టెక్నాలజీ అభివృద్ధే లక్ష్యంగా గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకానుంది. ఫైబర్‌ గ్రిడ్‌ తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లోని 13 జిల్లాల్లో 2వేల ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ లింక్స్‌ ను గూగుల్‌ ఎక్స్‌ ఏర్పాటు చేయనుంది. దీంతో ఫైబర్‌ కేబుల్‌ అవసరం లేకుండానే మొబైల్‌ డేటా - వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యంత వేగవంతంగా బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి తేనుంది. కాగా ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ…గూగుల్‌ ఎక్స్‌ రాకతో ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనికేషన్‌ లో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు.

కాగా, ఈ ఏడాది మే నెల‌లో కూడా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గూగుల్ ఎక్స్ క్యాంప‌స్‌ లో ప‌ర్య‌టించారు. అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చిన సందర్భంగా చంద్ర‌బాబు సచివాలయంలో విలేక‌రుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న ప‌ర్య‌ట‌న విశేషాలు వెల్ల‌డిస్తూ...గూగుల్ ఎక్స్ కేంద్రంలో డ్రైవర్ లెస్ కార్ - బెలూన్స్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రయోగాలు చూశానని తెలిపారు. ప్రపంచంలో మన రాష్ట్రంలోనే ప్రయోగం చేయడానికి గూగుల్ ఎక్స్ ముందుకొచ్చిందని చెప్పారు. గూగుల్ ఎక్స్ తన ప్రయోగాలన్నింటికీ ఏపీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడానికి ఒప్పించినట్లు చంద్ర‌బాబు తెలిపారు.

ఇదిలాఉండ‌గా...సీఎం చంద్రబాబునాయుడు కుటుంబంతో కలిసి ఐదు రోజుల విదేశీ పర్యటన చేయనున్నారు. ఈ నెల 18నుంచి 22వరకు మాల్దీవుల్లో పర్యటిస్తారని సమాచారం. చంద్రబాబుతో పాటు విదేశీ పర్యటనలో భువనేశ్వరి - లోకేశ్‌ - బ్రాహ్మణి - దేవాన్ష్‌ పాల్గొననున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్‌ నేరుగా మాల్దీవులు వెళ్లే అవకాశం ఉంది.