Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి ఈడీ షాక్.. ఇళ్లపై దాడులు

By:  Tupaki Desk   |   27 Sep 2018 4:57 AM GMT
రేవంత్ రెడ్డికి ఈడీ షాక్.. ఇళ్లపై దాడులు
X
ముందస్తు ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. మొన్నీ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని మానవ అక్రమ రవాణా కేసులో జైలుకు పంపిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేవంత్ ను టార్గెట్ చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన రేవంత్ రెడ్డి ఇంటిపై ఈ ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు కొడంగల్ , రేవంత్ బంధువుల ఇళ్లు మొత్తం 15చోట్ల బెంగళూరు - ఢిల్లీ - హైదరాబాద్ ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు జరుపుతున్నారు. సోదాలు జరుగుతున్న చోట్ల రేవంత్ సహా వారి కుటుంబ సభ్యుల ఫోన్లన్నంటిని స్వీచ్ ఆఫ్ చేయించారు. దాడుల్లో ఐటీ అధికారులు పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డిపై హఠాత్తుగా ఎన్నికల వేళ ఐటీ దాడులు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయంలో రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ తో రూ. కోటి రూపాయలకు డీల్ కుదిర్చాడనే ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు రూ.50లక్షలను రేవంత్ రెడ్డి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ కేసును ఏసీబీ ఈడీ అధికారులకు అప్పగించింది. ఇందులో భాగంగా ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి ఇళ్లతోపాటు కార్యాలయాలపై సోదాలు తాజాగా చేపట్టినట్టు సమాచారం. ఇక జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఇప్పటికే జూబ్లిహిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.

కాగా ముందస్తు ఎన్నికల వేళ దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఈ ఐటీ దాడులు, వివిధ కేసుల వల్ల ఆందోళన చెందుతున్నారు. రేవంత్ కూడా తనపై దాడులు జరుగబోతున్నాయంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతీకార దాడులను టీ కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటోందనే ప్రశ్న అందరిలోనూ టెన్షన్ రేపుతోంది.