Begin typing your search above and press return to search.

అమ్మ‌కు వైద్యం అందించిన వ్య‌క్తే...ఐటీ టార్గెట్‌!

By:  Tupaki Desk   |   9 Nov 2017 11:58 AM GMT
అమ్మ‌కు వైద్యం అందించిన వ్య‌క్తే...ఐటీ టార్గెట్‌!
X
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం, ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు అమ్మ‌గా ఆప్యాయంగా పిలుచుకునే జ‌య‌ల‌లిత చ‌నిపోయిన త‌ర్వాత అక్క‌డి రాజ‌కీయాలు దాదాపుగా ర‌స‌కందాయంలో ప‌డిపోయాయి. ఏ రోజు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి కూడా అక్క‌డ నెల‌కొని ఉందంటే... అతిశ‌యోక్తి కాదేమో. జ‌య మ‌ర‌ణించిన త‌ర్వాత సీఎం ప‌గ్గాలు చేప‌ట్టిన పన్నీర్ సెల్వం... జ‌య నెచ్చెలి, చిన్న‌మ్మ‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చేసిన శ‌శిక‌ళ దెబ్బ‌కు ప‌ద‌వి దిగిపోక త‌ప్ప‌లేదు. ప‌న్నీర్‌ ను దించేసిన శ‌శిక‌ళ‌.. త‌న‌కు అనుకూలంగా ఉండే ప‌ళ‌నిసామిని పీఠం ఎక్కించేసింది. అయితే ఆమెకు షాకిస్తూ... ప‌న్నీర్‌ - ప‌ళ‌నిలు ఒక్క‌టైపోయి... శ‌శిక‌ళ వ‌ర్గాన్నే పార్టీ నుంచి గెంటేశారు. అయితే సీఎం పీఠాన్నే తానే అధిష్టించాల‌ని క‌ల‌లు గ‌న్న శ‌శిక‌ళ యోచ‌న‌ను ముందే ప‌సిగ‌ట్టి కేంద్రంలోని మోదీ స‌ర్కారు మొగ్గ‌లోనే తుంచేసింద‌నే చెప్పాలి. అస‌లు క‌ద‌లికే లేని ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న శ‌శిక‌ళ‌... ఈ ఒక్క యోచ‌న‌తో బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలులోకి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది.

ఇన్ని జ‌రుగుతున్నా కూడా జ‌య‌ల‌లిత చ‌నిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు మాత్రం బ‌య‌ట‌కు రాలేద‌నే చెప్పాలి. అప్ప‌టిదాకా బాగానే ఉన్న జ‌య... ఒకానొక రోజు మ‌తి స్థిమితం లేని స్థితిలో రాత్రి వేళ త‌న ఇంటికి స‌మీపంలోని అపోలో ఆసుప‌త్రిలో చేరిపోయారు. అప్ప‌టి నుంచి అపోలో, ఢిల్లీలోని ప్ర‌ఖ్యాత వైద్య‌శాల ఎయిమ్స్ వైద్యుల‌తో పాటు లండ‌న్ నుంచి చాలా కాలం పాటు చెన్నైలోనే మ‌కాం వేసిన డాక్ట‌ర్ రిచ‌ర్డ్ బిలే - ఆ త‌ర్వాత సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన ఫిజియోథెర‌పిస్టులు జ‌య‌కు చికిత్స అందించారు. ఈ చికిత్స‌లతో బాగానే కోలుకుని - నేడో - రేపో డిశ్చార్జీ అవుతార‌నుకున్న త‌రుణంలో గుండె పోటు వ‌చ్చిన కార‌ణంగా జ‌య క‌న్నుమూశారు. దాదాపు 70 రోజుల‌కు పైగా చికిత్స అందించినా... జ‌య స‌జీవంగా బ‌య‌ట‌కు రాలేదు. ఈ సంద‌ర్భంగా జ‌య‌కు అందిన చికిత్సపై సొంత పార్టీ అన్నాడీఎంకేకు చెందిన నేత‌ల‌తో పాటు విప‌క్ష డీఎంకే నేత‌లు కూడా ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. అయితే ఈ అనుమానాల‌పై అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు రావ‌డం, ఆ త‌ర్వాత వాటంత‌ట‌వే మాయ‌మ‌వ‌డం జ‌రిగిపోయింది. ఈ త‌రుణంలో ఉరుము లేని పిడుగులా నేటి ఉద‌యం త‌మిళ‌నాడులో ఐటీ శాఖ పంజా విసిరింది. జ‌య మృతి వెనుక ఉన్న కార‌ణాల‌ను విశ్లేషించే క్ర‌మంలోనే ఈ దాడులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

అయినా ఐటీ దాడుల‌కు - జ‌య మ‌ర‌ణం మిస్ట‌రీకి మధ్య ఉన్న సంబంధం ఏమిట‌న్న ప్ర‌శ్న వేసుకుంటే.... చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూడ‌క మాన‌వు. అపోలో ఆసుప‌త్రిలో జ‌యకు అందిన వైద్య చికిత్స‌లు మొత్తం డాక్ట‌ర్ శివ‌కుమార్ ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగాయి. ఈయ‌న శ‌శిక‌ళ‌కు చాలా ద‌గ్గ‌ర బంధువు. శశిక‌ళ సోద‌రుడి కుమార్తె ప్ర‌భానే ఈయ‌న వివాహం చేసుకున్నారు. ఇక ఆసుప‌త్రిలో జ‌య‌కు వెన్నంటే ఉన్న‌ది శ‌శిక‌ళే అన్న విష‌యం తెలిసిందే. శ‌శిక‌ళ స‌మ‌క్షంలో శివ‌కుమార్ అండ్ కో జ‌య‌కు చికిత్స అందించింద‌న్న మాట‌. ఇప్పుడు ఆ శివ‌కుమార్ ఇంటిలోనే ఐటీ శాఖ దాడులు చేస్తోంది. నేటి ఉద‌యం నుంచి జ‌రుగుతున్న ఈ దాడుల్లో భాగంగా ఇప్ప‌టికే శివ‌కుమార్ ఇంటి నుంచి ఐటీ శాఖ అధికారులు ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం శ‌శిక‌ళ బంధువుల ఆధ్వ‌ర్యంలోనే ఉన్న జ‌య ఎస్టేట్ కొడ‌నాడునూ ఐటీ శాఖ అధికారులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఇక్క‌డ కూడా ప‌లు కీల‌క ప‌త్రాలు ల‌భ్య‌మైన‌ట్లు స‌మాచారం. ఇవ‌న్నీ చూస్తుంటే... జ‌య మృతి వెనుక ఉన్న మిస్ట‌రీ దాదాపుగా వీడిపోయిన‌ట్లేనన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయితే ఆ విష‌య‌మేదో అధికారికంగా వెలువ‌డేంత వ‌ర‌కూ ఉ ఒక్క‌రు కూడా బ‌య‌ట‌కు వెల్ల‌డించే అవ‌కాశాలు లేవ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌గా వినిపిస్తోంది. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?