Begin typing your search above and press return to search.

‘సీఎస్’ కొడుకుగారి 500 ఫ్లాట్ల ముచ్చట

By:  Tupaki Desk   |   27 Dec 2016 5:19 AM GMT
‘సీఎస్’ కొడుకుగారి 500 ఫ్లాట్ల ముచ్చట
X
పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని బయటకు వస్తున్న ‘పెద్దల’ అవినీతి లెక్కలు షాకింగ్ గా మారాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారుడి ఆస్తుల లెక్క వింటే కళ్లు చెదిరిపోవాల్సిందే. పది కాదు ఇరవై కాదు.. ఏకంగా 500 లగ్జరీ ఫ్లాట్లను కొనేయటమే కాదు..ఒక ఆసుపత్రి.. రూ.300 కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టు.. ఒక ఔట్ సోర్సింగ్ కంపెనీ.. ఇలా చెప్పుకుంటూ పోతే భారీ ఎత్తున ఆస్తులు బయటకు వస్తున్నాయి.

సంచలనం సృష్టించిన తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ అవినీతి లెక్కలు తేలుస్తున్న వేళ.. ఆయన కుమారుడు వివేక్ ఆస్తులు అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. రామ్మోహన్ రావు ఆస్తులపై దాడులు నిర్వహించిన సందర్భంలో.. ఆయన కుమారుడు వివేక్ ఆస్తులపై కూడా సోదాలు నిర్వహించారు. తిరువాన్మియూరులో వివేక్ ఇంట్లో లభించిన పలు కీలక డాక్యుమెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తన తండ్రికున్న అధికారాన్ని కొడుకు వివేక్ పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లుగా అంచనా వేస్తున్నారు. తన స్నేహితుడు భాస్కర్ నాయుడుతో కలిసి కోట్లాది రూపాయిల వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ వైద్యశాఖ ద్వారా రూ.300కోట్ల విలువైన కాంట్రాక్టు పొందినట్లుగా అధికారుల విచారణలో బయటపడింది. బెంగళూరులో ఒక ఆసుపత్రిని ప్రారంభించిన వివేక్.. అక్కడే ఒక ఔట్ సోర్సింగ్ కంపెనీని స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

పలుచోట్ల పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించిన అధికారులు వివేక్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ నోటీసులు జారీ చేశారు. అయితే.. తన భార్య ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని.. విచారణకు హాజరయ్యేందుకు తనకు టైం కావాలని ఈడీ అధికారుల్ని కోరినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సోదాల తర్వాత అనారోగ్యానికి గురైన రామ్మోహన్ రావును రామచంద్ర వైద్య కళాశాల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పటివరకూ గుండ్రాయి లెక్కన ఉండే పెద్దమనుషులు.. అధికారులు తనిఖీలు స్టార్ట్ చేయగానో.. ఎక్కడెక్కడి పాడు రోగాలన్నీ వచ్చేస్తాయి సుమీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/