Begin typing your search above and press return to search.

మళ్లీ కోట్లల్లో నోట్ల కట్టలు.. ఎక్కడ.. ఎవరి వద్దనో తెలుసా?

By:  Tupaki Desk   |   11 Aug 2022 10:00 AM GMT
మళ్లీ కోట్లల్లో నోట్ల కట్టలు.. ఎక్కడ.. ఎవరి వద్దనో తెలుసా?
X
ఇటీవల పశ్చిమ బెంగాల్ లో (మాజీ) మంత్రి పార్థా ఛటర్జీ నివాసాలు, కార్యాలయాలు, ఆయన సన్నిహితురాలు, సినీ నటి అర్పిత ముఖర్జీకి సంబంధించిన ఆస్తులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన దాడులు దేశంలో ఎంతటి కలకలం రేపాయో అందరికీ తెలిసిందే. బెంగాల్ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పార్ళా ఛటర్జీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించే ఆయనపై ఈడీ దాడులు చేసింది. ఈ సోదాల్లో దొరికన మొత్తం రూ.50 కోట్లపైనే కావడం గమనార్హం.

అంతేకాదు.. నటి అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు విలాసవంతమైన కార్లు కనిపించడం లేదని, వాటి నిండా డబ్బే ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ఇక అర్పితకు పార్ళా ఛటర్జీ ఓ ఫామ్ హౌస్ కొనిచ్చాడని.. దాని పేరు ''అపా'' అని కూడా వార్తలు వినిపించాయి. అర్పిత-పార్థా ఇద్దరి పేర్లూ కలిసొచ్చేలా అపా అని పెట్టారని లోకం కోడై కూసింది. వీటన్నిటితో పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొలగించారు. అంతేకాదు.. ఆయనను పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. పార్టీలో నంబర్ 3 అయిన పార్థాపై వేటు సీఎం మమతాతో పాటు బెంగాల్ అధికార పార్టీ టీఎంసీని ఇబ్బందుల్లో పెట్టిందనడం వాస్తవం.

మొన్న యూపీలో.. బెంగాల్ లో, నిన్న తమిళనాడులో

గత వారం తమిళనాడులోనూ ఐటీ దాడులు చేసింది. సినీ ప్రముఖులే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. దీంట్లో రూ.200 కోట్లు గుర్తించినట్లు సమాచారం. వీటన్నిటినీ చూస్తే దేశంలో రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార ప్రముఖుల వద్ద ఎంతటి నల్ల ధనం పోగుపడిందో అనే భావన ప్రజల్లో వచ్చింది. అంతకుముందు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముంగింట ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ ఆర్థిక మూలాలను కట్టడి చేసే ఉద్దేశంలో కాన్పూర్‌కు చెందిన ఓ సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లో కేంద్ర సంస్థలు దాడులు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సమయంలో నోట్ల గుట్టలు బయటపడడం సంచలనం రేపింది. నాడు కూడా రూ.కోట్ల కొద్దీ డబ్బును గుర్తించారు. యూపీ, బెంగాల్, తమిళనాడు ఉదంతాలు మర్చిపోకముందే.. ఇప్పుడు మహారాష్ట్రలో ఓ వ్యాపారి నివాసంలో జరిపిన ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాల్లో రూ.కోట్లలో నగదు బయటపడింది. ఈ ఘటన జాల్నా జిల్లాలోని ఓ వ్యాపార సంస్థ పై ఇటీవల ఐటీ శాఖ ఈ దాడులు చేసింది. పెద్దఎత్తున సాగిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.56 కోట్లు దొరికాయి.

260 మంది.. 13 గంటలు లెక్కింపు

నోట్లు కట్టలు కట్టలుగా బయటపడడం.. వాటిని చూసి నోరెళ్లబెట్టడం.. మిషన్లు తెచ్చి లెక్కించడం.. వంటి సంఘటనలు మనం సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ సినిమాలో ఇలాంటి సన్నివేశాలే కనిపిస్తాయి. అయితే, జాల్నాలో ఆదాయ పన్ను శాఖ సోదాల్లో దొరికిన రూ.56 కోట్లను లెక్కించడానికి అధికారులకు ఏకంగా 13 గంటల సమయం పట్టింది. ఇవేకాక రూ.వందల కోట్ల బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు. స్టీల్‌, దుస్తులు, స్థిరాస్థి వ్యాపారం చేసే జాల్నాకు చెందిన బిజినెస్ గ్రూప్ కొన్నేళ్లుగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ శాఖకు ఉప్పందింది.

ఆగస్టు 1 నుంచి గత సోమవారం వరకు ఏకంగా 8 రోజుల పాటు 260 మంది ఐటీ సిబ్బంది ఐదు బృందాలుగా జాల్నా జిల్లా అంతటా చేపట్టారు. వ్యాపార సంస్థ యజమాని ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు సాగాయి. రూ.56 కోట్ల నగదుతో పాటు రూ.14 కోట్ల బంగారు, వజ్రాభరణాలను సీజ్ చేశారు. మిగిలిన ఆస్తుల డిజిటల్‌ డేటా, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తనిఖీల్లో రూ.390 కోట్ల మేర లెక్కల్లోకి రాని బినామీ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.