Begin typing your search above and press return to search.

గుళ్లో గులాబీ ఎమ్మెల్యే హోమం.. ఇంట్లో ఐటీ రైడ్స్

By:  Tupaki Desk   |   21 Nov 2019 7:20 AM GMT
గుళ్లో గులాబీ ఎమ్మెల్యే హోమం.. ఇంట్లో ఐటీ రైడ్స్
X
టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన వైనం పెను సంచలనంగా మారటం తెలిసిందే. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు షురూ అయిన ఈ తనిఖీలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగుతుండటం ఆసక్తికరంగా మారింది. అధికారపార్టీకి చెందిన కీలక ఎమ్మెల్యే.. సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ కు సన్నిహితంగా ఉంటూ.. వారికి అత్యంత విధేయుడిగా వ్యవహరించే నేత ఇంటిపై ఐటీ దాడులు ఆసక్తికరంగా మారాయి.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. కూకట్ పల్లిలోని ఒక శివాలయంలో బుధవారం ఉదయం ఆరు గంటల వేళ ప్రత్యేక హోమాన్ని (కార్తీకమాసం నేపథ్యంలో) నిర్వహిస్తున్న వేళ.. తన ఇంట్లో ఆదాయపన్ను అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమాచారాన్ని అందుకున్నారు. అయినప్పటికీ.. హోమం పూర్తి అయిన తర్వాత గుడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ ఎపిసోడ్ లో కూకట్ పల్లి ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. మాధవరం ఆస్తులపై ఐటీ దాడులు అనే కంటే కూడా.. ఆయన కుమారుడి కారణంగానే ఐటీ తనిఖీలు జరిగాయని చెప్పాలి. కాకుంటే.. అధికారపక్ష ఎమ్మెల్యే కావటంలో మీడియా ఫోకస్ అంతా మాధవరం మీద ఉందని చెప్పక తప్పదు. మాధవరం కుమారుడు సందీప్ రావు ప్రణీత్ హోమ్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థలో ఒక డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

తన తండ్రితో పాటు నివాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో చాలా వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థగా చెప్పాలి. ప్రణీత్ సంస్థ ఎండీ నరేందర్ తో పాటు.. మరో నలుగురు డైరెక్టర్లు.. ఇతర భాగస్వాముల ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహించటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు మీడియాలో హైలెట్ అయినట్లుగా కూకట్ పల్లి ఎమ్మెల్యే కంటే కూడా ఆయన కుమారుడి కారణంగానే ఐటీ తనిఖీలు సాగాయని చెప్పాలి.

జీఎస్టీ చెల్లింపులకు సంబంధించిన వ్యత్యాసాలే తాజా తనిఖీలకు కారణంగా చెబుతున్నారు. స్వల్ప వ్యవధిలో అంతకంతకూ విస్తరించుకుపోతున్న ప్రణీత్ సంస్థ.. ఆ సంస్థ దాదాపు వెయ్యి కోట్ల టర్నోవర్ కు దగ్గరగా ఉందన్న వాదనలు తరచూ వినిపిస్తున్న వేళ.. ఐటీ శాఖ కన్ను పడినట్లు చెబుతున్నారు. ప్రణీత్ గ్రూపులో పెద్ద ఎత్తున ఏదో జరుగుతుందన్న భావన ఐటీ శాఖలో ఉందన్న మాట వినిపిస్తోంది.
నిజానికి ప్రణీత్ తో పాటు.. పలువురు బిల్డర్ల మీదా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కాకుంటే మీడియాలో కూకట్ పల్లి ఎమ్మెల్యే ఫోకస్ అయినంత ఎక్కువగా మిగిలిన వారి పేర్లు బయటకు రాలేదని చెబుతున్నారు. తాజా సోదాల్లో పెద్ద ఎత్తున ప్రణీత్ హోమ్స్ కు చెందిన పత్రాలు.. లావాదేవీలకు సంబంధించిన రికార్డులను.. పన్ను చెల్లింపులకు సంబంధించిన పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.