Begin typing your search above and press return to search.

ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన మోడీ!

By:  Tupaki Desk   |   2 Aug 2017 4:22 PM GMT
ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన మోడీ!
X
గుజరాత్ రాష్ట్రంలో రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరుగుతూ ఉంటే.. అక్కడ కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు ఏ క్షణంలో ఎటు ఫిరాయిస్తారో అనే భయం ఉన్నప్పుడు వారితో క్యాంపు రాజకీయాలు నడపదలచుకోవడం సహజం. అయితే అందుకు వారు ప్రత్యేకించి పనిగట్టుకుని బెంగుళూరు నగరానికే ఎందుకు వచ్చారు? అనేది ఎవ్వరికీ ఇన్నాళ్లుగా అంతు చిక్కలేదు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ కర్ణాటక కే రావడంలో ఓ మతలబు ఉంది. ఆ మతలబు చిక్కుముడి ఈరోజు వీడిపోయింది. గుజరాత్ లో తాము ప్రలోభ పెట్టదలచుకున్న ఎమ్మెల్యేలను బెంగుళూరుకే ఎందుకు తరలించారంటే.. అక్కడ మాత్రమే విద్యుత్తు శాఖ మంత్రి డికె శివకుమార్ ఉన్నారు.

బుధవారం నాడు ఐటీ శాఖ ఏకకాలంలో దేశంలోని 39 చోట్ల కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై జరిపించిన ఐటీ దాడుల వలన హఠాత్తుగా డికె శివకుమార్ అనే పేరు జాతీయ వ్యాప్తంగా పతాక శీర్షికల్లోకి వచ్చింది. ఇంతకూ డికె శివకుమార్ ఎవరు? అదే ఇప్పుడు కీలకం!

డికె శివకుమార్ దేశంలోనే అత్యంత సంపన్నులు అయిన రాజకీయ నాయకుల్లో ఒకరు. ప్రస్తుతం గుజరాత్ ఎమ్మెల్యేలను ప్రస్తుతం ఉంచిన బెంగుళూరు శివార్లలోని రిసార్టులోనే ఆయన కూడా ఓ సూట్ తీసుకుని ఉన్నారు. వారి సంరక్షణ, పోషణ ఇతర బాధ్యతలు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఇలాంటి కీలకమైన మర్మం బయటపడింది గనుకనే ఐటీ శాఖ శివకుమార్ మరియు రిసార్టుల్లోని ఎమ్మెల్యేల గదులు, పలుచోట్ల శివకుమార్ బంధువులు అందరి ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. శివకుమార్ ఇంటినుంచి 9 కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే నరేంద్రమోడీ సర్కారు ఐటీ దాడుల ద్వారా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది. గుజరాత్ లో ఒక్క రాజ్యసభ సీటు కోసం... ఇన్ని అరాచకాలు చేస్తున్నదని కాంగ్రెస్ వాపోతోంది. ఐటీదాడులతో ప్రభుత్వానికి సంబంధం లేదని మోడీ దళం మిన్నకుండిపోవచ్చు. కానీ అదే అయితే గనుక.. గుజరాత్ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మోడీ సరిగ్గా కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే , సరిగ్గా ఆయువుపట్టు మీదే దెబ్బ కొట్టారని అర్థమవుతుంది. మరి కాంగ్రెస్ ఎలా కోలుకుంటుందో.. గుజరాత్ నుంచి సోనియా వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్ ను రాజ్యసభకు పంగలుగుతుందో లేదో చూడాలి.