Begin typing your search above and press return to search.

ఐటీ దెబ్బ‌కు శ‌శిక‌ళ వ‌ర్గం కుదేలైపోయిందే!

By:  Tupaki Desk   |   13 Nov 2017 11:22 AM GMT
ఐటీ దెబ్బ‌కు శ‌శిక‌ళ వ‌ర్గం కుదేలైపోయిందే!
X
త‌మిళ‌నాడులో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి, మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం ఒక‌టైపోవ‌డంతో ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు సిద్ధ‌మైన శ‌శిక‌ళ వ‌ర్గానికి కేంద్రం ఊహించ‌ని షాకిచ్చింది. ఇటీవ‌ల ఆదాయ పన్నుశాఖ జ‌రిపిన వ‌రుస దాడుల‌తో చిన్న‌మ్మ వ‌ర్గం బెంబేలెత్తుతోంది. తాజాగా ఐటీ విచారణ వలయంలోకి శశికళ కుటుంబంతో పాటు సన్నిహితులు - సహాయకులను మూడు వందల మందిని తీసుకొచ్చారు. వీరిలో ఎనిమిది మంది టాప్‌ లిస్టులో ఉన్నారు. వీరందరికీ సమన్లు సిద్ధం చేస్తున్నారు. వీరంతా ఒకరి తర్వాత మరొకరు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది.

మ‌రోవైపు.. శ‌శిక‌ళ మేన‌ల్లుడు, ఇళవరసి కుమారుడు వివేక్‌ మెడకు మాత్రం ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నట్టు స‌మాచారం. 27 ఏళ్ల వయసుకే న వివేక్ దాదాపు రూ.1000కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్టు ఐటీ దాడుల్లో వెలుగు చూడటం చిన్నమ్మ కుటుంబానికి నిద్ర క‌రువ‌య్యేలా చేస్తోంది. శశికళ కుటుంబం - స‌న్నిహితులే ల‌క్ష్యంగా త‌మిళ‌నాట గురువారం నుంచి ఐటీ దాడులు జ‌రుగుతున్న విషయం తెలిసిందే. తొలిరోజు 187 చోట్ల, రెండోరోజు 147 చోట్ల, మూడో రోజు 40 చోట్ల తనిఖీలు జరిగాయి. ఇక, నాలుగో రోజైన సోమ‌వారం 20 చోట్ల ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ప్రధానంగా ఐటీ ఉన్నతాధికారులే స్వ‌యంగా రంగంలోకి దిగడంతో తదుప‌రి చ‌ర్య‌ల‌పై చర్చ సాగుతోంది.

ఐటీ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఏకకాలంలో, రోజుల తరబడి సాగుతున్న ఈ దాడులపై దేశ‌మంతా దృష్టి సారించింది. ఈ నేప‌థ్యంలో కొన్ని త‌మిళ‌ రాజకీయ పక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే, మరికొన్ని ఐటీ దాడుల్ని ఆహ్వానిస్తున్నాయి. మ‌రోవైపు గుట్ట‌లు గుట్ట‌లుగా బ‌య‌ట‌ప‌డుతున్న సొత్తు, న‌గ‌దు నాలుగు రోజులుగా చిన్నమ్మ అండ్ కో కు దిమ్మ‌తిరిగిపోయేలా చేస్తున్నాయి. పట్టువదలని విక్రమార్కుల్లా తిష్ట వేసిన ఐటీ అధికారులు అణువణువూ త‌నిఖీలు నిర్వ‌హిస్తూ, దొరికిన‌ ఆధారాలను, వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు. దీంతో ఇక మ‌న్నార్‌గుడి మాఫియాకు కాలం చెల్లిన‌ట్లేన‌ని త‌మిళ‌నాడు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.