Begin typing your search above and press return to search.

గోల్డ్ ఫిష్‌?: 'నారాయ‌ణ‌'లో ఐటీ దాడులు!?

By:  Tupaki Desk   |   5 Oct 2018 4:44 AM GMT
గోల్డ్ ఫిష్‌?:  నారాయ‌ణ‌లో ఐటీ దాడులు!?
X
ఐటీ దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ హీట్‌ను అంత‌కంత‌కూ పెంచేస్తున్నాయి. మొన్న‌టివ‌ర‌కూ తెలంగాణ రాష్ట్రంలో విప‌క్షాల‌కు చెందిన నేత‌ల ఇళ్ల‌ల్లోనూ.. వారి బంధువులు.. స్నేహితుల ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హించిన ఐటీ శాఖ‌.. తాజాగా ఏపీ మీద దృష్టి సారించింది. మ‌రీ.. ముఖ్యంగా అమ‌రావ‌తిపై క‌న్నేసింది.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కుడిభుజంగా.. అమ‌రావ‌తికి సంబంధించి అన్నీ అంశాల్లోనూ ప‌ట్టు ఉండ‌ట‌మే కాదు.. టీడీపీ ఆర్థిక మూలాల‌కు మూల స్తంభంగా చెప్పే నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత క‌మ్ ఏపీ మంత్రి నారాయ‌ణ‌కు చెందిన విద్యా సంస్థ‌ల్లో ఐటీ సోదాలు నిర్వ‌హించారు.

శుక్ర‌వారం ఉద‌యం నుంచి నారాయ‌ణ‌కు చెందిన వివిధ విద్యాసంస్థ‌ల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. విజ‌య‌వాడ‌.. గుంటూరు నుంచి వ‌చ్చిన ఐటీ అధికారులు పోలీసుల భ‌ద్ర‌త మ‌ధ్య సోదాలు నిర్వ‌హిస్తున్నారు. నారాయ‌ణకు సంబంధించిన ఆస్తుల‌పై ఐటీ సోదాలు నిర్వ‌హించ‌టం చూస్తే.. ఈ వ్య‌వ‌హారం వ్యూహాత్మ‌కంగా సాగుతుందా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.

అర‌గంట ముందు తాము సోదాలు నిర్వ‌హించే ప్రాంతం చెబుతామ‌ని.. అందుకు అవ‌స‌ర‌మైన పోలీసు సిబ్బందిని త‌మ‌కు అంద‌జేయాల‌ని ఐటీ శాఖ కోరుతున్న‌ట్లుగా చెబుతున్నారు. విజ‌య‌వాడ‌లోని ఆటోన‌గ‌ర్ కార్యాల‌యంలో స‌మావేశ‌మైన ఐటీ అధికారులు కార్యాచ‌ర‌ణను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీకి చెందిన అధికార‌ప‌క్షానికి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు..పారిశ్రామివేత్త‌ల‌తో పాటు.. కాంట్రాక్ట‌ర్ల‌కు చెందిన సంస్థ‌ల్లోనూ.. ఇళ్ల‌ల్లోనూ సోదాలు నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో భూలావాదేవీలు భారీగా జ‌రిపి.. ప‌న్నులు క‌ట్ట‌లేద‌ని భావిస్తున్న వారికి సంబంధించిన జాబితాను సిద్ధం చేశార‌ని.. అందులో ఇద్ద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా ఉంటార‌ని చెబుతున్నారు. ఏపీ అధికార‌ప‌క్షానికి.. కేంద్రానికి మ‌ధ్య స‌రైన సంబంధాలు లేని వేళ చోటు చేసుకుంటున్న ఈ సోదాల‌కు రాజకీయ ప్రాధాన్య‌త ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. నారాయ‌ణ విద్యా సంస్థ‌ల్లో ఐటీ సోదాలు జ‌రుగుతున్నట్లుగా వార్త‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నా.. స‌ద‌రు సంస్థ మాత్రం సోదాల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.