Begin typing your search above and press return to search.

చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో 24 గంటలుగా ఐటీ సోదాలు..

By:  Tupaki Desk   |   7 Feb 2020 4:31 AM GMT
చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో 24 గంటలుగా ఐటీ సోదాలు..
X
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉండగా.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి (పీఏ)గా పనిచేసిన శ్రీనివాస్ రావు ఇంట్లో ఐటీ సోదాలు 24 గంటలుగా నిరాటంకంగా కొనసాగుతుండడం సంచలనంగా మారింది. ఆయన నివాసులు ఉన్న రెండు చోట్లా హైద్రాబాద్ లోని చంపాపేట్ , విజయవాడ గాయత్రి నగర్ కంచుకోట అపార్ట్ మెంట్ లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

విశేషం ఏంటంటే రాత్రి కూడా గ్యాప్ ఇవ్వకుండా రాత్రి అంతా మేల్కోని డాక్యుమెంట్లు పరిశీలిస్తుండడం సంచలనంగా మారింది... ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

*కాంట్రాక్ట్ పనులు గుత్తేదారులకు కేటాయించడంలో కీలక పాత్ర?
చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఆయన పీఏగా పనిచేసిన శ్రీనివాస్ మొదట సెక్రెటేరియట్ ఉద్యోగి. ఆయన సీఎం చంద్రబాబు పీఏ అయ్యాక కాంట్రాక్టు పనుల్లో కీలకంగా వ్యవహరించాడన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ పనులు గుత్తేదారులకు కేటాయించడంలో బాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్టు కోట్లలో డీల్ చేసినట్టు ఆరోపణలున్నాయి..

*సి.ఆర్.పి.ఎఫ్ బలగాలతో ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ బృందాలు
ఈ ఐటీ సోదాల్లో ఆశ్చర్యకరంగా రాష్ట్ర పోలీసులను ఐటీ అధికారులు వాడుకోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర పోలీసులు ఉంటే లీక్ చేస్తారన్న నెపంతోనే ఢిల్లీ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను ఐటీ అధికారులు తీసుకొచ్చి సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది.

* టీడీపీ నేతల్లో ఆందోళన
విజయవాడ సిటీ పరిధిలోని మాచవరం పోలీసులు ఈ ఐటీ సోదాలపై ఆరా తీసినట్టు తెలిసింది.. ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నట్లు పోలీసులకు వెల్లడించిన సి.ఆర్.పి.ఎఫ్ సిబ్బంది.. రాష్ట్ర పోలీసులను మాత్రం లోపలికి అనుమతించక పోవడం గమనార్హం.

అర్ధరాత్రి సమయంలో ఐటీ అధికారులు శ్రీనివాస్ రావుతో పాటు, స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు ను హైదరాబాద్ కు తరలించే ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఐటీ అధికారులు సోదాలు ముగిశాక దీనిపై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.