Begin typing your search above and press return to search.

తమిళ హీరో విజయ్ అరెస్టు అవుతారా?

By:  Tupaki Desk   |   8 Feb 2020 10:41 AM IST
తమిళ హీరో విజయ్ అరెస్టు అవుతారా?
X
కోలీవుడ్ లోనే కాదు.. యావత్ తమిళనాడులో సంచలనంగా మారాయి హీరో విజయ్ తో పాటు.. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ సోదాలు. ఆదాయపన్ను అధికారులు జరిపిన తనిఖీల్లో నోట్ల కట్టలు గుట్టలు.. గుట్టలు బయట పడటం ఒక సంచలనమైతే..ఈ వ్యవహారం కాస్తా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుందన్న వాదన వినిపిస్తోంది.

ఐటీ సోదాల నేపథ్యంలో హీరో విజయ్ ను అరెస్టు చేసే అవకాశం కూడా ఉందన్న మాట వినిపిస్తోంది. ఆ మధ్య విజయ్ నటించిన మెర్శల్ చిత్రంలో ఉచిత వైద్యం.. జీఎస్టీ లాంటి అంశాలకు సంబంధించి విమర్శలు సంధిస్తూ ఘాటు వ్యాఖ్యలతో కూడిన సన్నివేశాలు ఉన్నాయి. అప్పట్లో ఈ సన్నివేశాల్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.

దీనికి కొనసాగింపుగా విజయ్ నటించిన బిగిల్ (తెలుగులో విజిల్) చిత్ర ఆడియో లాంఛ్ వేళలోనూ అధికార అన్నాడీఎంకే నేతలకు హెచ్చరికలు జారీ చేసే విధంగావిజయ్ వ్యాఖ్యలు చేయటం.. తన అభిమానులపై దాడులు చేసే వారిని సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా జరిగిన ఐటీ దాడుల వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్న వాదన వినిపిస్తోంది. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి లాంటి వారు విజయ్ పై జరిగిన ఐటీ దాడులకు బీజేపీనే కారణమని ఆరోపించటం గమనార్హం. తన సినిమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు చేశారని.. అందుకే ఆయన ఇంట్లో ఐటీ సోదాలు చేశారన్న మాట పలువురు నేతల నోట రావటం గమనార్హం.

అయితే.. ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్న విజయ్ ఉదంతంపై చిత్ర పరిశ్రమకు చెందిన వారు నోరు విప్పకపోవటం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజా తనిఖీల నేపథ్యంలో విజయ్ మీద కేసు నమోదు చేయటమేకాదు.. అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో.. ఆయన అభిమానులు ఆందోళన కు గురి అవుతున్నారు.