Begin typing your search above and press return to search.

పార్ట్ 2 సోదాలు..క‌ల్కి గురించి ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు!

By:  Tupaki Desk   |   21 Oct 2019 4:39 PM GMT
పార్ట్ 2 సోదాలు..క‌ల్కి గురించి ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు!
X
ఐదెకరాల నుంచి ప్రారంభమై వేలాది ఎకరాలకు ఆశ్ర‌మాన్ని విస్తరించిన వివాదాస్ప‌ద‌ కల్కిభగవాన్ లీల‌లు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. గ‌త నాలుగు రోజులుగా సోదాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ... కల్కిభగవాన్‌ దంపతులు అజ్ఞాతంలోనే ఉన్నారు. తాజాగా కల్కి కుమారుడు కృష్ణకు చెందిన వైట్ లోటస్‌లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. భారీగా నగదు - బంగారం - కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కల్కికి ఇండియాలోనే కాకుండా అరబిక్ దేశాలతో పాటు కెన్యా - ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కృష్ణకు చెందిన ఆస్తులతో పాటు - ఆయన వ్యాపార భాగస్వాములపై కూడా ఐటీ దాడులు జరిగాయ‌ని స‌మాచారం. స్థానిక ఐటీ అధికారుల సహకారంతో చెన్నైకి చెందిన అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహించింది.

క‌ల్కికి చెందిన చెన్నైలోని ప్రధాన కార్యాలయంతో పాటు తమిళనాడు - ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ - కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆశ్రమాలు - కార్యాలయాలు - భూముల కొనుగోళ్లు - విరాళాల సేకరణలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కిభగవాన్‌ కు చెందిన ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. అజ్ఞాతంలోకి వెళ్లిన కల్కి భగవాన్‌ - ఆయన భార్య పద్మావతి జాడ ఇంకా తెలియ‌డం లేదు. చెన్నైలోని నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణ - కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారిస్తున్నారని స‌మాచారం.

ఈ ఆపరేషన్‌ లో 300 మంది అధికారులు పాల్గొన‌గా ఏక కాలంలో బెంగళూరు - చెన్నై - హైదరాబాద్‌ - చిత్తూరు సహా 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ నోట్లు - కిలోల కొద్ది బంగారం - బండిల్స్ కొద్ది డాక్యుమెంట్లు.. ఇలా తవ్వెకొద్దీ కల్కికి చెందిన అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 90 కిలోల బంగారంతో రూ.5 కోట్ల విలువైన వజ్రాలు, రూ.44 కోట్ల నగదు గుర్తించారు. ఇక, 20 కోట్ల విదేశీ కరెన్సీ కూడా సోదాల్లో బయటపడింది. హవాలా రూపంలో రూ.85 కోట్లు వచ్చినట్టుగా గుర్తించారు. లెక్కల్లోకిరాని రూ.500 కోట్లపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, కల్కి ఆలయాన్ని గోల్డెన్‌ సిటీగా, ఆ తరువాత ‘వన్నెస్‌'గా మార్చారు. ప్రస్తుతం ‘ఏకం’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కల్కి ట్రస్ట్‌ పేరుతో జరిపే ఆర్థిక లావాదేవీలను కొన్నాళ్లకు ‘గోల్డెన్‌ షెల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' పేరుతో నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.