Begin typing your search above and press return to search.

భ్ర‌మిత్ షాకు కౌంట‌ర్ మొద‌లైందా?

By:  Tupaki Desk   |   18 Sep 2018 1:26 PM GMT
భ్ర‌మిత్ షాకు కౌంట‌ర్ మొద‌లైందా?
X
తెలంగాణ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. రాజ‌కీయంగా ప‌లు మార్పుల‌కు ఈ ఘ‌ట‌న కార‌ణ‌మ‌య్యే అవకాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. టీఆర్ ఎస్‌.. బీజేపీ మ‌ధ్య ర‌హ‌స్య స్నేహం న‌డుస్తుంద‌న్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న వేళ‌.. అందుకు భిన్నంగా టీఆర్ ఎస్‌ పై అమిత్ షా ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టం ఒక ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం అయితే.. మీరేంటి? మీకంటే మేం మ‌రింత ఘాటుగా తిట్ట‌గ‌లం అంటూ తాజా మాజీ మంత్రి కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి మ‌రీ.. భ్ర‌మిత్ షా అంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు.

తెర వెనుక భుజం భుజం రాసుకుపోతున్నార‌న్న దానికి భిన్నంగా ఈ ఘాటు విమ‌ర్శ‌లు ప‌లు సందేహాల‌కు తావిస్తున్న వేళ‌.. ఇంత‌కీ టీఆర్ఎస్ మ‌న‌కు మిత్ర‌ప‌క్ష‌మా? వైరి ప‌క్ష‌మా? అంటూ బీజేపీ అగ్ర‌నేత‌లు ఒకింత అయోమ‌యంతో షాను ప్ర‌శ్నించ‌టం.. మీకిక క్లారిటీ రాదా? అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

టీఆర్ ఎస్‌.. బీజేపీ సంబంధాలపై అస్ప‌ష్ట‌త కొన‌సాగుతున్న వేళ‌.. ఈ రోజు ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. టీఆర్ ఎస్ ఎంపీ క‌మ్ వ్యాపార‌వేత్త‌ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డికి చెందిన సంస్థ‌ల్లో ఆదాయ‌ప‌న్ను శాఖాధికారులు సోదాలు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. హైద‌రాబాద్‌లో 12 చోట్ల‌.. ఖ‌మ్మంలో ఆరు చోట్ల ఏక కాలంలో సోదాలు కొన‌సాగుతుండ‌టం విశేషంగా మారింది.

ఖ‌మ్మంలోని టీఆర్ ఎస్ ఎంపీ నివాస‌మైన శ్రీ‌శ్రీ స‌ర్కిర్ ద‌గ్గ‌ర‌గా ఉండే ఇంట్లో మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సోదాలు చేప‌ట్టారు. ఇంట్లోకి ఎవ‌రూ రాకుండా రెండు గేట్ల‌ను మూసివేశారు. ఇదిలా ఉండ‌గా బంజారాహిల్స్ లోని రాఘ‌వ ఇన్ ఫ్రా కార్యాల‌యంలోనూ త‌నిఖీలు చేప‌ట్టారు. ఐటీ చెల్లింపుల విష‌యంలో అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఈ త‌నిఖీలు మ‌రో రోజు కొన‌సాగే వీలుంద‌ని తెలుస్తోంది. అధికార‌ప‌క్షానికి చెందిన ఎంపీ వ్యాపార సంస్థ‌ల్లో.. ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హించ‌టం రోటీన్ వ్య‌వ‌హారం కాదంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ త‌నిఖీల‌పై పొంగులేటి స్పందించారు. ఇవి సాధార‌ణ సోదాలు మాత్ర‌మేన‌ని.. వీటిని ప్ర‌త్యేకంగా చూడాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి.. త‌ర్వాతి కాలంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఉన్న పార్టీ ఎంపీ ఆస్తుల‌పై సోదాలు నిర్వ‌హించ‌టం దేనికి సంకేతం అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఈ త‌నిఖీలు రానున్న రోజుల్లో మ‌రిన్ని ప‌రిణామాల‌కు కార‌ణ‌మ‌వుతుందంటున్నారు.