Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం:చిదంబ‌రం..లాలూ ఇళ్ల‌పై ఐటీ దాడులు

By:  Tupaki Desk   |   16 May 2017 6:38 AM GMT
సంచ‌ల‌నం:చిదంబ‌రం..లాలూ ఇళ్ల‌పై ఐటీ దాడులు
X
ఇటీవ‌ల కాలంలో సీబీఐ మ‌హా చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇవాల్టి ఇవాళ జ‌రిగిన ప‌రిణామాలు చూస్తే.. నిజ‌మేనా? అనుకోవాల్సిందే. ఒకే రోజు.. కొద్ది గంట‌ల తేడాతో ఇద్ద‌రు మాజీ కేంద్ర‌మంత్రుల ఇళ్ల‌పైన సీబీఐ సోదాలు నిర్వ‌హించ‌టం ఒక విశేషం అయితే.. ఈ ఇద్ద‌రూ దేశ రాజ‌కీయాల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసిన వారు కావ‌టం మ‌రో విశేషంగా చెప్పాలి.

రెండు వేర్వేరు అంశాల‌కు సంబంధించి ఈ ఇద్ద‌రు నేత‌ల ఇళ్ల‌పైనా.. వారి ప‌రివారం ఇళ్ల‌పైనా దాడులు నిర్వ‌హించ‌టం సంచ‌ల‌నంగా మారింది. సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తున్న ఆ ఇద్ద‌రు మాజీ కేంద్ర మంత్రులు ఎవ‌రంటే.. ఒక‌రు త‌మిళ‌నాడుకు చెందిన చిదంబ‌రం కాగా.. మ‌రొక‌రు బీహార్ కు చెందిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌. కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌.. సోనియాగాంధీకి అత్యంత స‌న్నిహిత నేత‌ల్లో ఒక‌రైన చిదంబ‌రం.. ఆయ‌న కుమారుడు కార్తీ చిదంబ‌రంతో పాటు.. వారికి సంబంధించిన 14 ప్రాంతాల్లో ఏక కాలంలో సీబీఐ సోదాలు నిర్వ‌హించ‌టం గ‌మ‌నార్హం.

చెన్నైలోని చిదంబ‌రం.. కార్తీ చిదంబ‌రం ఇళ్ల‌తో పాటు.. ఢిల్లీ.. నోయిడాలోనూ సీబీఐ సోదాలు నిర్వ‌హించింది. విదేశీ పెట్టుబ‌డులు తీసుకునేందుకు ఓ మీడియా గ్రూపున‌కు లంచం తీసుకొని అనుమ‌తులు ఇప్పించిన‌ట్లుగా కార్తీ చిదంబ‌రానికి చెందిన సంస్థపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇంద్రాణి ముఖ‌ర్జికి చెందిన ఐఎన్ఎక్స్ మీడియాకు 2008లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అనుమ‌తులు మంజూరు చేసిన‌ట్లుగా చెబుతారు. ఇదిలా ఉండ‌గా.. ఎయిర్ సెల్‌.. మ్యాక్సిస్ ఒప్పందాల వ్య‌వ‌హారంలోనూ కార్తీపై ఐటీ..ఈడీ వ‌ర్గాలు ఇప్ప‌టికే దాడులు నిర్వ‌హించ‌టం తెలిసిందే. తాజాగా ఈ ఉదంతం సుప్రీం దృష్టికి వెళ్ల‌టం.. అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల నేప‌థ్యంలో సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్లుగా భావిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. బీహార్ అధికార‌ప‌క్ష భాగ‌స్వామి.. ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయిల మేర బినామీ భూముల ఒప్పందాల‌తో ఆయ‌న‌కు సంబంధం ఉంద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో.. లాలూకు చెందిన కంపెనీలు.. స‌న్నిహితుల ఇళ్ల‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఢిల్లీ.. గుర్ గావ్ ల‌ల్లోని మొత్తం 22 చోట్ల సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే దాణా కుంభ‌కోణంలో చిక్కుల్లో ప‌డ్డ లాలూకు.. తాజా బినామీ భూముల వ్య‌వ‌హారం ఏం చేస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/