Begin typing your search above and press return to search.

ఆయనింట్లో 25 గంటలు నాన్ స్టాప్ సోదాలు

By:  Tupaki Desk   |   22 Dec 2016 6:35 AM GMT
ఆయనింట్లో 25 గంటలు నాన్ స్టాప్ సోదాలు
X
దేశ చరిత్రలో తొలిసారి చోటు చేసుకున్న పరిణామం ఇది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటి అత్యున్నత అధికారి ఇంటిపై ఆదాయపన్ను శాఖాధికారులు దాడులు చేయటం సంచలనంగా మారిందని చెప్పాలి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన దాడులు దేశ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వేలాది మంది అధికారులకు.. మంత్రులకు దిశానిర్దేశం చేసే స్థాయిలో ఉన్న పెద్దమనిషికి ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయో చూస్తే అయ్యో అనుకోవాల్సిందే.

మరో ఏడాదిలో రిటైర్ అయ్యే వేళలో.. ఇంతకాలం పాలనా చక్రం తిప్పిన ఆయన చేతుల్ని కట్టేసేలా పరిణామాలు ఒకటి తర్వాత ఒకటిగా వేగంగా సాగిపోవటం చూసినప్పుడు రాజకీయ చదరంగంలో ఆయనో పావుగా మారారా? అన్న సందేహం కలగక మానదు. దివంగత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా.. సన్నిహితుడిగా పేరున్న సీఎస్.. రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ సోదాలకు సంబంధించిన ఆసక్తర విషయం ఒకటి బయటకు వచ్చింది.

ఆయన ఇంటిని.. ఆఫీసును.. ఆయన బంధువులు..స్నేహితులు.. ఇలాంటి ఆయనకు లింకున్న ప్రతి ఒక్కరి ఇళ్లపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంటిపైఐటీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు అనుసరించిన వ్యూహం చూస్తే.. కాసింత షాకింగ్ గా ఉంటుందని చెప్పక తప్పదు.

బుధవారం తెల్లవారుజామున 5 గంటల వ్యవధిలో పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్న ఐటీ అధికారులు.. తాము ఎవరన్న విషయాన్ని చెప్పి సీఎస్ ఇంట్లో చొరబడ్డారు. ఆ టైంలో రామ్మోహన్ రావు నిద్రపోతున్నారు. తాము ఎవరన్న విషయాన్ని చెప్పిన అధికారులు.. పని వారికి సమాచారం అందించి సీఎస్ కు విషయాన్ని చెప్పి.. బయటకు రావాల్సిందిగా కోరి.. వెనువెంటనే తనిఖీలు నిర్వహించటం మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు.

నిద్ర నుంచి లేచిన వెంటనే షాకింగ్ న్యూస్ విన్న ఆయన.. బయటకు వచ్చిన వెంటనే.. తనిఖీల గురించి చెప్పి.. ఆయన నోట మాట రాకుండా చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో శాంతిభద్రతలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వీలుగా.. కేంద్ర పారామిలటరీ దళాలు పెద్ద ఎత్తున సీఎస్ ఇంటి వద్దకు చేరుకొని.. ఆయన ఇంటిని.. పరిసరాల్ని తన అధీనంలోకి తీసుకున్న వైనం చూస్తే.. సీఎస్ రామ్మోహన్ రావును ఎంతగా అడ్డంగా బుక్ చేయాలో అంత అడ్డంగా బుక్ చేసిన వైనం అర్థమవుతుంది.

తనిఖీలంటూ మొదలైన వెదుకులాట నిరంతరాయంగా సాగటం కొత్త చర్చకు తావిస్తోంది. బుధవారం ఉదయం 5 గంటలకు మొదలైన సోదాలు.. గురువారం ఉదయం 6 గంటల వరకూ సాగటం చూస్తే విషయం చాలా తీవ్రమైనదన్న భావన వ్యక్తమవుతోంది. నాన్ స్టాప్ గా 25 గంటలు సాగిన తనిఖీల పరంపర ఎట్టకేలకు ముగిసింది. ఇంత పెద్ద ఎత్తున జరిపిన సోదాలతో ఏం దొరికాయి అన్న అధికారిక సమాచారం మాత్రం ఇంకా విడుదల చేయలేదు. బుధవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం మొత్తం రూ.30 లక్షల క్యాష్ (వీటిల్లో అత్యధికంగా రూ.2వేల కొత్తనోట్లే ఉన్నట్లుగా చెబుతున్నారు).. ఐదు కేజీల బంగారం.. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/