Begin typing your search above and press return to search.

మన రాజ్యమెపుడో చెప్పరాదే...?

By:  Tupaki Desk   |   6 April 2022 8:08 AM GMT
మన రాజ్యమెపుడో చెప్పరాదే...?
X
ఆయన్ని దించేస్తాను. ఆయన సీఎం కాకుండా చూస్తాను. ఆ పార్టీని పతనం లోకి నెడతాను. ఇవీ జనసేనాని పవన్ కళ్యాణ్ మైకు ముందు చేసే భీషణ ప్రతిజ్ఞలు. ఆయనలో ఆవేశం పాళ్లు ఎక్కువ. అలా మాట్లాడుతూ తానుగా ఊగిపోతూ ఆయన వైసీపీని చస్తే అధికారంలోకి రానీయను అంటున్నారు. ఇలా ఆయన చెప్పడం ఇది ఎన్నోసారో వైసీపీ నేతలు అయితే కరెక్ట్ గా లెక్కలేసుకుని చెబుతారు కానీ ఆ విషయం కంటే ముందు పవన్ తన సొంత క్యాడర్ కి, తన పార్టీ మనుషులకు చెప్పాల్సినది చాలానే ఉంది.

పవన్ పార్టీ పెట్టి ఈ రోజుకు ఎనిమిదేళ్ళు. వచ్చే ఎన్నికలకు పదేళ్లు పూర్తి అవుతుంది. పవన్ ఏమీ ఆషామాషీ మనిషి కాదు. ఫుల్లుగా సినీ గ్లామర్ ఉన్న వారు. అంతకు మించి ఏపీలో బలమైన సామాజికవర్గం దన్ను ఉన్న నేత. ఇక ఏపీలో ఏ పార్టీకీ లేనంత యువతరం అభిమానం ఆయనకు ఉంది. అలాంటి పవన్ ఏపీకి సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఒక బలమైన సామాజికవర్గం కూడా గట్టిగా కోరుకుంటోంది.

కానీ పవన్ నోటి వెంట మాత్రం ఆణిముత్యం లాంటి ఆ మాట మాత్రం రావడం లేదు. ఆయన పార్టీ మీటింగ్ పెట్టినా బహిరంగ సభలో మాట్లాడినా ఫ్యాన్స్ కి అర్ధం కానట్లుగానే మాట్లాడుతున్నారు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఇంతకీ జనసేనాని ఏమంటున్నారు అంటే వచ్చే ఎన్నికల తరువాత ఏపీలో ప్రజా ప్రభుత్వం వస్తుందని. ప్రజలు పల్లకీ ఎక్కుతారని, వారిని అలా ఎక్కించేందుకు తాను తన పార్టీ రెడీగా ఉన్నాయని.

కవిత్వంలో అయితే శ్లేషలు ఉంటాయి. విశేషణాలు ఉంటాయి. గూఢార్ధాలు కూడా ఉంటాయి. మరి రాజకీయాల్లొ అంతలా కవితా ధోరణిలో చెబితే ఎవరికి అర్ధమవుతుంది పవనన్నా అంటున్నారు అభిమానులు. మాకు ఒక్క ముక్క చెప్పి పోరాదే. నేనే ఏపీకి కాబోయే సీఎం అని గట్టిగా చెప్పరాదే అన్నదే వారి మాట.

నేనే రేపటి ఏపీకి ముఖ్యమంత్రిని. 2024లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని నిఖార్సుగా పవన్ చెబితే తమ చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉంటుందని జనసైనికులు అంటున్నారు. కానీ పవన్ మాత్రం ప్రజా ప్రభుత్వం అన్న పవర్ ఫుల్ మాటను వాడుతున్నారు. ప్రజా ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే చెబుతారు.

ప్రజలు ఓట్లు వేయకపోతే ఎవరూ అధికారంలోకి రారు. మరి ఆ విధంగా చూస్తే ప్రజా ప్రభుత్వం అంటే అది జనసేన అవుతుందా కాదా. ఇక్కడ ఫ్యాన్స్ కి క్లారిటీ కావాలి. ప్రజల పల్లకీ మోస్తాను అని పవన్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. వారి సేవకులు ప్రజలే. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే పల్లకిలో ఎపుడూ ప్రజలే ఉంటారు. సో వారికి ఈసారి సేవ చేసేది ఎవరు. దీనికి కూడా పక్కాగా క్లారిటీ కావాలి.

మరి పవన్ ఈ విషయం పక్కన పెట్టి మిగిలినది అంతా మాట్లాడుతున్నారు అనే వారి బాధ, ఇతర రాజకీయ పార్టీల బాధ కూడా అదేనట. నేను సీఎం అని పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అని వైసీపీ వారు అయితే సూటిగానే అడుగుతున్నారు. ఆయన పల్లకీ మోసేది చంద్రబాబుకే అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబారు ఎకసెక్కం ఆడుతున్నారు.

ఆయన చంద్రబాబు అధికారంలో ఉంటే వ్యతిరేక ఓట్లు చీలుస్తారు. అదే జగన్ అధికారంలో ఉంటే వ్యతిరక ఓట్లను చీలకుండా కాపాడుతాను అంటారు. దీంతో ఆయన ఎవరి పల్లకీని మోస్తున్నారు ఈజీగా అర్ధమైపోవడం లేదూ అని అంబటి దీర్ఘాలు తీసి మరీ అర్ధాలూ పరమార్ధాలు విడమరచి చెబుతున్నారు.

దాంతోనే జనసైనికులకు కూడా కొత్త డౌట్లు వస్తున్నాయట. అన్నా పవనన్నా ఆ ఒక్క మాట గట్టిగా సౌండ్ చేయరాదే అని వారు అంటున్నారు. నేనే ముఖ్యమంత్రిని అని చెబితే అన్ని నోర్లూ మూతపడతాయి కదా అన్నదే వారి ఆవేదన. ఆశ. మరి పవన్ అలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారా. ఏమో చూడాలి. పవన్ రాజకీయం మొత్తంలో ఒకటి అయితే క్లారిటీగా ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకూడదు, అది మాత్రం ఆయన వేదిక ఏదైనా పదే పదే బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ముందు అది జరిగిన తరువాతనే మిగిలిన విషయాలు అని ఆయన అనుకుంటే మాత్రం 2024 వరకూ ఇలాగే కధ సాగుతూనే ఉంటుంది మరి.