Begin typing your search above and press return to search.
ఆ దూరాన్ని తగ్గించేందుకు ఈటల ప్రయత్నాలు
By: Tupaki Desk | 18 Dec 2021 12:30 AM GMTఆరు నెలల ముందు వరకూ తెలంగాణలో అధికార పార్టీ మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్.. ఇప్పుడు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే. అనూహ్య రీతిలో రాజకీయ పరిణామాలు మారిపోవడంతో రాష్ట్రంలో పరిస్థితిల్లో వేగంగా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో అధికారం దిశగా సాగుతున్న బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ పార్టీ జోరు మరింత పెరిగింది. కానీ మరోవైపు బీజేపీ నుంచి పోటీ చేసినప్పటికీ ఈటల సొంత అజెండాతోనే సాగుతున్నారని, తనకున్న బలంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని అనుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి.
ఇక ఇటీవల కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ తరపున ఏ అభ్యర్థి పోటీ చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. కానీ అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ బహిరంగంగానే ఈటల మద్దతు ప్రకటించారు. ఆయన గెలుపు కోసం కూడా ఈటల వ్యూహాలు రచించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో ఈటల మద్దతు చూసుకుని ముగ్గురు బీజేపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా రవీందర్కుఓటు వేసినట్లు తెలిసింది. దీంతో ఈ పరిణామాలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అనుమతి లేకుండా స్వతంత్ర అభ్యర్థిని ఎలా బలపరుస్తారని ఆ ముగ్గురు కార్పొరేటర్లకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం నోటీసులు జారీ చేసినట్లు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటలకు, రాష్ట్ర బీజేపీ నేతలకు మధ్య విబేధాలు ఉన్నయానే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ వాటన్నింటికీ ఈటల తన మాటలతో చెక్ పెట్టారు.
తాజాగా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్ధంగా ఉన్నానని ఈటల ప్రకటించారు. దీంతో తాను పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పడం ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏకంగా కేసీఆర్‌పైనే పోటీకి దిగుతానని చెప్పడం ద్వారా పార్టీలో ఉద్వేగాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. అలాగే బీజేపీ ముఖ్య నేతలు ఎవరితోనూ తనకు విబేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోనైనా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోనైనా తనకు మంచి సంబంధాలే ఉన్నాయని పేర్కొన్న ఆయన తనకు వ్యతిరేకంగా వస్తున్న ప్రచారానికి తెరదించారు. ఇక తాను పార్టీలు మారే వాడిని కానంటూ ఈటల చెప్పుకోచ్చారు. టీఆర్ఎస్ నుంచి కూడా తనకు తానుగా బయటకు రాలేదని.. వాళ్లే బయటకు పంపారంటూ ఆయన తెలిపారు. తాను పార్టీలు మారనని స్పష్టం చేశారు. దీంతో బీజేపీలో ఈటల ఎక్కువ కాలం ఉండలేరని ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారని వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికారు.
ఆ మద్దతుతో..
కేసీఆర్‌పై పోటీకి..