Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్టు.. ఇటలీ ఇప్పుడెలా ఉందంటే?

By:  Tupaki Desk   |   27 March 2020 4:40 AM GMT
గ్రౌండ్ రిపోర్టు.. ఇటలీ ఇప్పుడెలా ఉందంటే?
X
కొద్ది రోజుల కిందట కూడా ఇటలీ అన్నంతనే.. కలల గమ్యస్థానంగా పలువురు చెప్పేవారు. అలాంటి అందమైన దేశం కరోనా కారణంగా భయానంగా మారింది. అక్కడి పరిస్థితికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ భయాన్ని పుట్టిస్తున్నారు. శవాలు గుట్టలు గుట్టలుగా పడేస్తున్న తీరు చూస్తే.. ఎలాంటి దేశానికి ఎలాంటి దుస్థితి అన్న భావన కలుగక మానదు.

వేలాదిగా పెరుగుతున్న కేసులు.. వందల మంది రోజులో మరణిస్తున్న ఇటలీలో ఇప్పుడు భయానక వాతావరణం ఉంది. ఈ దేశంలో ఉన్నత విద్య కోసం వచ్చి.. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి వెళ్లలేక చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎక్కువే. ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం ఆ దేశంలో 350 మందికి పైనే భారతీయ విద్యార్థులు ఉన్నారని చెబుతున్నారు.

తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆదిత్య అనే విద్యార్థి ఒకరు తెలుగు మీడియాతో ఫోన్లో మాట్లాడారు. ఇటలీ గ్రౌండ్ జీరో పరిస్థితి ఎలా ఉందో చెబుతూ.. తమను కాపాడాలని వేడుకున్నారు. ఇటలీ ప్రభుత్వం.. అక్కడి ప్రజల నిర్లక్ష్యమే ఇప్పుడా దేశం కొంప ముంచిందని చెప్పారు. కరోనా అక్కడ వేగంగా విస్తరిస్తోందని.. వేలల్లో కేసులు నమోదు అవుతున్నట్లు చెప్పారు. మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎక్కడికక్కడ డెడ్ బాడీతో పరిసరాలు నిండిపోతున్నాయని.. వాటి మధ్యే తాము బతకాల్సి వస్తోందన్నారు.

తమ చుట్టూ ఉన్న వారికి ఒక్కొక్కరికి పాజిటివ్ కేసులునమోదు అవుతుంటే.. తమకు భయం వేస్తుందన్నారు. తాము ఇక్కడ మరణిస్తే.. తమ డెడ్ బాడీస్ ను భారత్ కు పంపరని చెబుతున్నారని.. ఇలాంటివేళ.. తమ వేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదన్నారు. ప్రభుత్వం పంపిన మెడికల్ కిట్లు సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమను మంత్రి కేటీఆర్ ఆదుకోవాలని కోరుతున్నారు. తమను ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి.. వీరి వేదన విషయంలో మంత్రి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.