Begin typing your search above and press return to search.

‘ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌’ నినాదానికి దెబ్బ: ఇంగ్లండ్ ఓటమి..ఇటలీ గెలుపు ఎందుకు?

By:  Tupaki Desk   |   13 July 2021 4:01 AM GMT
‘ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌’ నినాదానికి దెబ్బ:  ఇంగ్లండ్ ఓటమి..ఇటలీ గెలుపు ఎందుకు?
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై ఏళ్లు. అవును.. చేతికి వచ్చిన అద్భుత అవకాశాన్ని ఇంగ్లండ్ జట్టు చేజార్చుకుంది. అదే సమయంలో.. గత యూరో కప్ కు అర్హత కూడా సాధించని జట్టు ఏకంగా టోర్నీని సొంతం చేసుకున్న సిత్రమైన పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. యూరో కప్ ఆరంభం నుంచి ‘ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌’ అంటూ గర్జించి.. ఎవరేమన్నా ఈసారికి మాత్రం కప్పు తమదేనని గొప్పలు చెప్పుకున్న ఇంగ్లండ్ జట్టు మితిమీరిన ఆత్మవిశ్వాసం కప్పును చేజారేలా చేసింది. అదే సమయలో రెండోసారి యూరో కప్పును తమ సొంతం చేసుకున్న ఇటలీ జట్టు.. ఇంగ్లండ్ జట్టు నినాదంలోని ఒక్క అక్షరాన్ని మార్చి ‘ఇట్స్‌ కమింగ్‌ రోమ్‌’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఉత్కంఠ భరింతంగా సాగిన యూరోపియన్ చాంపియన్ షిప్ లో ఇటలీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఎందుకు ఓడింది? ఇటలీ ఎందుకు గెలిచిందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. టోర్నీ ఫైనల్ ముగిసి.. ఫలితం వెల్లడైన వేళ.. పాత సెంటిమెంట్ ఒకటి తాజా టోర్నీలోనూ కంటిన్యూ అయినట్లుగా చెప్పాలి. కప్పు ఏదైనా టోర్నీ ఫైనల్ ఇంగ్లండ్ - ఇటలీ మధ్య జరిగితే.. ఇటలీ చేతిలో ఇంగ్లండ్ జట్టు ఓటమి చెందటం ఒక అనవాయితీ. తాజా యూరో టోర్నీలోనూ ఇది రిపీట్ కావటం గమనార్హం.

మితిమీరిన ఆత్మవిశ్వాసమే ఇంగ్లండ్ జట్టు కొంప ముంచినట్లుగా చెప్పాలి. మ్యాచ్ ముగిసే సమయానికి రెండు జట్లు సమంగా గోల్స్ చేయటంతో.. పెనాల్టీ షూట్ అవుట్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించాలని డిసైడ్ చేశారు. ఈ సందర్భంగా హై డ్రామా చోటు చేసుకుంది. ఇంగ్లండ్ జట్టు తన ఐదు పెనాల్టీ కిక్స్ లో మూడింటిని గోల్స్ గా మలిస్తే.. అనంతరం మ్యాచ్ విజేతను తేల్చే పెనాల్టీ షూట్ అవుట్లను ఇంగ్లండ్ జట్టు సభ్యులు షురూ చేశారు. మొత్తం నాలుగు ప్రయత్నాల్లో రెండు గోల్స్ మాత్రమే సాధించటం.. చివరిదైన ఐదో కిక్ లో ఇంగ్లండ్ జట్టు సభ్యుడు బంతిని ఇటలీ గోల్ కీపర్ చేతుల్లోకి నేరుగా పంపటంతో ఇంగ్లండ్ ఓటమి ఖరారు కాగా.. ఇటలీ సంబరాల్లో మునిగిపోయింది.

మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత భారీ విధ్వంసమే చోటు చేసుకుంది. ఇంగ్లండ్ అభిమానులు రెచ్చిపోయి ఇటలీ అభిమానులు.. మద్దతుదారులపై పిడి గుద్దులు గుద్దారు. ఇటలీ జాతీయ పతాకాన్ని అవమానించారు. వీదుల్లో ఇష్టారాజ్యంగా తిరుగుతూ నల్లజాతీయులు సహా.. ఇటలీ జాతీయులుకనిపిస్తే వారిపై దాడికి తెగబడ్డారు. ఇంగ్లండ్ అభిమానుల్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారికి గాయాలు కావటం గమనార్హం. చివరకు బ్రిటన్ ప్రధాని సీన్లోకి వచ్చి.. ఇంగ్లండ్ జట్టులోని నల్లజాతీయులైన క్రీడాకారులకు మద్దతు తెలిపి.. వారు హీరోలుగా అభివర్ణించినప్పటికీ.. అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. మ్యాచ్ ఓటమికి వారే కారణమంటూ మండిపడ్డారు. యూరో విజేత ఇటలీకి మన రూపాయిల్లో రూ.300 కోట్లు ప్రైజ్ మనీగా లభించగా.. ఓడిన రన్నరప్ ఇంగ్లండ్ కు రూ.267 కోట్ల ప్రైజ్ మనీతో పాటు.. మ్యాచ్ ఫీజు లభించింది.