Begin typing your search above and press return to search.

బాబును ప‌వ‌న్ ప్ర‌శ్నిస్తారా?

By:  Tupaki Desk   |   3 April 2017 8:06 AM GMT
బాబును ప‌వ‌న్  ప్ర‌శ్నిస్తారా?
X
అంద‌రి లాంటి వాడిని కాద‌ని చెప్పుకోవ‌టం గొప్పేం కాదు. మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో అదెంత నిజ‌మ‌న్న విష‌యాన్ని చేసి చూపించిన‌ప్పుడు మాత్ర‌మే రాజ‌కీయ నేత మాట‌కు విలువ ఉంటుంది. ప్ర‌శ్నించ‌టం కోస‌మే తాను పార్టీ పెట్టిన‌ట్లుగా.. త‌ప్పు ఎవ‌రు చేసినా తాను స‌హించ‌న‌ని.. దేవుడు లాంటి అన్న‌య్య‌ను సైతం రాజ‌కీయంగా విభేదించ‌టానికి తాను సిద్ధ‌మైన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ గొప్ప‌గా చెబుతుంటారు. ఆ మాట నిజ‌మే అనుకుంటే.. తాజాగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై కిక్కుర‌మ‌నుకుండా ప‌వ‌న్ ఎందుకు ఉన్న‌ట్లు? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా.. ప‌లువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇస్తూ చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవ‌టం జరిగింది. ఏళ్ల‌కు ఏళ్లు పార్టీకి సేవ అందించిన వారి కంటే కూడా..ఆయారాం గ‌యారాం లాంటి వారికే ప‌ద‌వులు ఇస్తారా? అంటూ బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు ప‌లువురు తెలుగు త‌మ్ముళ్లు. ప‌ద‌వులు ద‌క్క‌క‌పోతే అసంతృప్తి మామూలే కానీ.. ఈ స్థాయిలో టీడీపీ నేత‌లు ఫైర్ అవుతార‌ని పార్టీ అధినాయ‌క‌త్వం అస్స‌లు ఊహించ‌లేద‌ని చెబుతారు.

ఇదిలా ఉంటే.. 2014 ఎన్నిక‌ల వేళ‌లో బాబుతో క‌లిసి ప్ర‌చారం చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తాజా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కూర్పుపై ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఎందుకంటే.. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్ని త‌మ పార్టీలో చేర్చుకున్న వేళ‌.. కేసీఆర్ వారిలో ఒక‌రికి మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడిచిన‌ట్లుగా మండిప‌డ్డారు. మ‌రి.. ఆరోజు కేసీఆర్ నిర్ణ‌యాన్ని అంత‌గా త‌ప్పు ప‌ట్టిన చంద్ర‌బాబు.. ఈ రోజున తాను అదే బాట‌లో న‌డ‌వ‌టంపై ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్పే జ‌న‌సేనాధినేత‌.. తాజాగా బాబు తీసుకున్న నిర్ణ‌యంపై ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది టీడీపీ వ‌ర్గాల్లోనూ ఉత్కంట వ్య‌క్త‌మ‌వుతోంది.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చంద్ర‌బాబు అనుస‌రించిన ధోరణిపై ప్ర‌జ‌ల్లో ప్ర‌తికూల భావ‌న వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. నిత్యం నీతులు చెప్పే చంద్ర‌బాబు.. ఈ రోజు త‌న వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి స్వార్థ రాజ‌కీయాల‌కు తెర తీసిన వైనం స‌రికాదంటూ సోష‌ల్ మీడియాలో ఎక్కేస్తున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేల‌కు బాబు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌టంపై జ‌గ‌న్‌కు సానుభూతి వెల్లువెత్తే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. బాబు తీసుకున్న నిర్ణ‌యంపై ప‌వ‌న్ స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మంత్రివ‌ర్గంలోకి భూమా అఖిల ప్రియ‌ను ఎంపిక చేయ‌టం ద్వారా బాబు తెలివిగా వ్య‌వ‌హ‌రించార‌న్న వాద‌న వినిపిస్తోంది. తండ్రి మ‌ర‌ణంతో భూమా అఖిల‌ప్రియ‌పై సానుభూతి వెల్లువ‌లా వచ్చి ప‌డిన వేళ‌.. ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌టం లేదు. నిజానికి జ‌గ‌న్ పార్టీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికి.. వ్య‌క్తిగ‌తంగా ఆమెకు జ‌రిగిన న‌ష్టం నేప‌థ్యంలో.. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టం త‌ప్పుగా ఎత్తి చూప‌లేని ప‌రిస్థితిని ప‌లువురికి ఎదుర‌వుతోంది. ఇందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మిన‌హాయింపు కాద‌న్న మాట వినిపిస్తోంది. భూమా ఫ్యామిలీలో స‌న్నిహిత సంబంధాలు ఉన్న ప‌వ‌న్‌.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణపై విమ‌ర్శ‌లు గుప్పిస్తే.. అఖిల‌ప్రియ‌కు కూడా ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంది. అందుకే.. ఈ విష‌యంపై మౌనంగా ఉండే అవ‌కాశం ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. ప‌వ‌న్ కానీ తాజా ఉదంతంలో మౌనంగా ఉండ‌టమంటే.. రాజీ ప‌డిన‌ట్లేన‌ని.. ప్ర‌శ్నించేందుకే తాను పార్టీ పెట్టాన‌న్న మాట చెప్పుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు. మ‌రి.. ప‌వ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/