Begin typing your search above and press return to search.
వైసీపీ పథకాలపై వినూత్న ప్రచారం
By: Tupaki Desk | 4 Feb 2018 8:55 AM GMTఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ తన దూకుడు పెంచుతోంది. ఓవైపు ప్రజా సమస్యలపై స్పందిస్తూ...మరోవైపు పార్టీ భవిష్యత్‌లో ప్రజల కోసం చేసే కార్యక్రమాల గురించి వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది. తాజాగా గిద్దలూరు వైఎస్ ఆర్ సీపీ ఇంచార్జీ ఐవీరెడ్డి వైఎస్ జగన్ పథకాలపై ప్రత్యేక రీతిలో ప్రచారం చేపట్టారు. వైఎస్ జగనన్న బంగారు పథకాలు పేరుతో...వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత అమలుచేయబోయే పథకాల గురించి వివరించారు. ప్రత్యేకంగా ఓ కరపత్రం ముద్రించిన ఐవీ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటం విశేషం.
క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్న ఐవీరెడ్డి పార్టీ బలోపేతానికి కరపత్రాలతో క్షేత్రస్థాయి అనే ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే వైసీపీ విధానాలను - వైఎస్ జగన్ హామీలను - భవిష్యత్ కార్యాచరణను తెలియజెప్తున్న గిద్దలూరు ఇంచార్జీ తాజాగా ఈ పంథాను ఎన్నుకున్నారు. పించన్లు - రీయింబర్స్ మెంట్ - ఆరోగ్యశ్రీ - ఉచిత విద్యుత్ సహా నవరత్నాలకు చెందిన నూతన పథకాలపై సవివరంగా తెలియజెప్పే కార్యాచరణను తీసుకున్నారు.
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం నియోజకవర్గంలో సంతకాల సేకరణ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. నియోజకవర్గానికి చెందిన మండల - క్షేత్రస్థాయి నాయకులతో కలిసి ఈ కార్యక్రమం చురుగ్గా ముందుకు సాగుతోంది. ప్రత్యేక హోదా వల్ల నవ్యాంధ్రప్రదేశ్ కు జరిగే మేలు ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీరుపై విశేష అవగాహన కల్పిస్తున్నారు. తన ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారనే భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా పార్టీ నేతలు తెలియజేశారు.