Begin typing your search above and press return to search.
బాబు నిర్వాకం వల్లే పోలవరంలో జాప్యంఃఐవీ రెడ్డి
By: Tupaki Desk | 24 Dec 2017 7:51 AM GMTఏపీకి ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనువరిస్తున్న వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు - రైతులు - ప్రజల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులాగా మారుతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం ఇన్ చార్జీ ఐవీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలను తన చర్యల కారణంగా తీవ్రంగా దెబ్బతీసిన సీఎం చంద్రబాబు తాజాగా పోలవరం విషయంలో కూడా అవినీతి ద్వారా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకునేలా చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఐవీరెడ్డి మీడియాతో మాట్లాడారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేసేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అస్పష్ట వైఖరితో - అవినీతి విధానాలతో అగమ్యగోచర స్థితికి చేరిందని ఐవీ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు డిజైన్లు మార్చడం - అంచనాలు పెంచడం - కాంట్రాక్టర్ల మార్పు - పనుల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం వంటివి కేంద్రం దృష్టికి చేరాయని ఆయన వెల్లడించారు. అందుకే రాష్ట్రం నివేదికలు నమ్మకుండా కేంద్ర స్వంతంగా అధ్యయనం చేసిందని ఆ తర్వాతే ప్రాజెక్టు విషయంలో కొర్రీలు వేస్తోందని ఐవీ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి - స్వార్థ రాజకీయాల వల్ల రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టు మూగబోతోందని మండిపడ్డారు. తన బినామీలకు కాంట్రాక్టు ఇప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయడం తప్ప పోలవరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లడంపై దృష్టిసారించడం లేదని ఐవీరెడ్డి మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును తామే నిర్మిస్తామని ఆర్భాటంగా ముందుకు వెళ్లిన చంద్రబాబు అవినీతి ఆలోచనతోనే ఆ పనిచేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని ఐవీరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై విచారణ చేయాలని ఆయన కోరారు. సంవత్సరంలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి రాష్ట్ర రైతాంగానికి నీరివ్వాలని ఐవీ రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఐవీరెడ్డి...ప్రాజెక్టులోని అవినీతినే తాము తప్పుపడుతున్నామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగిస్తున్నారని ఐవీరెడ్డి మండిపడ్డారు. రాష్ర్టానికి హక్కుగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసి ప్యాకేజీ కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం రీత్యా దివంగత సీఎం వైఎస్ ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ - ఫీజు రీయింబర్స్ మెంట్ - పక్కాగృహాల నిర్మాణం - డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం వంటి పథకాలను తుంగలో తొక్కారని ఐవీరెడ్డి మండిపడ్డారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో పర్యటిస్తున్న నాయకులకు ప్రజలు నిలదీస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని భయపెడుతున్నారని అన్నారు. దివంగత వైఎస్సార్ సంక్షేమ రాజ్యం తిరిగి రావాలంటే...వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఐవీ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని - నవరత్నాలను అమలు చేసి ప్రజాసంక్షేమ పాలనను మరోమారు అందిస్తారని ఆయన స్పష్టం చేశారు.