Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌..మోడీ..ఇవాంకా క్రేజీ ట్వీట్‌

By:  Tupaki Desk   |   15 Nov 2017 4:56 AM GMT
హైద‌రాబాద్‌..మోడీ..ఇవాంకా క్రేజీ ట్వీట్‌
X
ఈ నెల 28నుంచి హైదరాబాద్‌లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ స‌మ్మిట్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ స‌మావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. ఇప్ప‌టికే ఆమె భ‌ద్ర‌త‌, ఇత‌ర‌త్రా ఏర్పాట్ల గురించి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో ఆమె తాజాగా క్రేజీ ట్వీట్ చేశారు. ఈ నెలాఖరులో జరుగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సదస్సు(జీఈఎస్)లో పాల్గొనడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఇవాంకా ట్రంప్ ఉత్సాహంగా ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే ఆవిష్కర్తలు పాల్గొనే సదస్సులో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి పాల్గొనబోతున్నానని తెలిపారు. రెండు వారాల్లో భారత్‌లో ప్రధాని నరేంద్ర మోడీని కలువబోతున్నానని పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా...అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ భారతదేశ పర్యటన నేపథ్యంలో ఆమె భద్రత చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌజ్ భద్రతా కార్యాలయం జారీ చేస్తున్న ఆదేశాలు ప్రధాని మోడీ భద్రతా కార్యాలయాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇవాంక భద్రతను తమకు వదిలేయాలని.. ఆమె సెక్యురిటీ అంతా తాము చూసుకుంటామంటూ కేంద్ర హోంశాఖతో పాటు ఎస్‌పీజీ(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌)కు స్పష్టమైన సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఆమె పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఐసీసీలో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులోకి పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో ప్రవేశించేందుకు వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇవాంక ట్రంప్‌ భద్రతతో పాటు దేశ ప్రధాని మోడీ భద్రత కూడా ముఖ్యమని, ఆయన వెనక ఆర్మ్‌డ్‌ సిబ్బంది ఉండాలని కేంద్ర హోంశాఖతో పాటు ఎస్పీజీ పట్టుబడుతున్నాయి. గతంలో టర్కీలో జరిగిన హైకమిషనర్‌ కాల్పుల వ్యవహారంతో అమెరికన్‌ సెక్యూరిటీ సదస్సులోకి ఎవరూ ఆయుధాలు తేవద్దన్న నిబంధనను పెడుతున్నట్టు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇవాంక ట్రంప్‌ భద్రతకు సంబంధించి అమెరికన్‌ సెక్యూరిటీయే ప్రత్యేకంగా వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించనున్నట్టు సమాచారం. ఈ ప‌రిణామం ఆస‌క్తిక‌రంగా మారింది.