Begin typing your search above and press return to search.

ఇవాంకా మ‌న కారెక్క‌దూ..మ‌న వంట తిన‌దు!

By:  Tupaki Desk   |   23 Nov 2017 1:05 PM GMT
ఇవాంకా మ‌న కారెక్క‌దూ..మ‌న వంట తిన‌దు!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో అనేక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆమె ప‌ర్య‌టించేందుకు మ‌రో ఐదు రోజుల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ వార్త‌ల‌న్నీ ఇవాంకా చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా ఆమె హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. జీఈఎస్‌ లో భాగంగా హైద‌రాబాద్ వ‌స్తున్న ఇవాంకా ఈ సంద‌ర్భంగా మ‌న కార్ల‌లో ప్ర‌యాణించ‌డం లేద‌ట‌.

అమెరికా అధ్య‌క్షుడి కోసం ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన కార్ల‌లోనే ఇవాంకా ట్రంప్ ప్ర‌యాణించ‌నున్నార‌ట‌. ప్ర‌ఖ్యాత జనరల్‌ మోటార్స్‌ సంస్థ అమెరికా అధ్యక్షుడి కుటుంబం కోసం ప్రత్యేకంగా తయారు చేసే లీమోజీన్‌ వాహనాల్లో మాత్ర‌మే ఇవాంకా ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ కారు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌కు మారుపేరుగా ఉంటుంది. మందుపాతరలు - తుపాకీ తూటాల నుంచి మాత్రమే కాదు రాకెట్‌ లాంచర్లు - జీవ - రసాయన దాడుల నుంచీ రక్షించగలిగేలా అన్ని రకాల సదుపాయాలు ఈ వాహనంలో ఉంటాయి. ఇవాంకా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇటువంటి వాహనాలు మూడింటిని తెప్పిస్తున్న అమెరికా అధికారులు ఇవాంక హైదరాబాద్‌ లో పాల్గొనే అన్ని కార్యక్రమాలకూ వీటినే వాడబోతున్నారని స‌మాచారం.

మ‌రోవైపు ఇవాంక విడిది - ఆహార వ్య‌వ‌హారాల విష‌యంలో కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇవాంకాకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు దేశంలోని ముంబయి - ఢిల్లీ - చెన్నై అమెరికా రాయబార కార్యాలయాల నుంచి 100 మంది ఉద్యోగులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ బృందంలో 20 మందికిపైగా వంటవాళ్లూ ఉన్నారని స‌మాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో తప్ప మిగతా కార్యక్రమాల్లో ఇవాంకా వీరు తయారు చేసే ఆహారమే తీసుకుంటారని తెలుస్తోంది. ఇవాంక బస చేసే వెస్టిన్‌ హోటల్‌ సిబ్బంది వివరాలన్నీ అధికారులు సేకరించారు. ఆమె ఉన్నప్పుడు విధుల్లో పాల్గొనే వారందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి వారిని మాత్రమే అనుమతిస్తారు. కాగా, ఇవాంకా న‌గ‌ర‌ ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా కూడా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాంక షాపింగ్ చేయ‌నున్న గాజుల దుకాణంలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ఉన్న గాజులు - వాటి తయారీకి వాడిన పదార్థాలు - అవి ఎక్కడ తయారయ్యాయి వంటివన్నీ ఆరా తీశారని తెలుస్తోంది. మ‌రోవైపు ప్రత్యేక డ్రోన్లు - నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ఆమె పర్యటించే - పరిసర ప్రాంతాల అన్నింటిపైనా నిరంతరం నిఘా కొనసాగించనున్నారని తెలుస్తోంది.