Begin typing your search above and press return to search.

ఇవాంకా వ‌చ్చేది 28న కాద‌ట‌

By:  Tupaki Desk   |   21 Nov 2017 5:55 AM GMT
ఇవాంకా వ‌చ్చేది 28న కాద‌ట‌
X
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె - సలహాదారు ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ రాక‌పై స్ప‌ష్ట‌త‌ వ‌చ్చింది. గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ షిప్ స‌మ్మిట్‌ కు హాజ‌ర‌య్యేందుకు స‌ద‌స్సు జరిగే రోజున‌ ఈనెల 28న హైదరాబాద్‌ కు రానున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అంత‌కు రెండు రోజుల ముందే ఇవాంకా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు జోస్యం చెప్పారు. అయితే తాజాగా అధికారికంగా ఆమె షెడ్యూల్ ప్రత్యేక ఖ‌రారైంది. ఇవాంకా ఈనెల 27న హైదరాబాద్ రానున్నారు.

అమెరికా నుంచి ప్ర‌త్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి రానున్న ఇవాంకా ట్రంప్ అక్కడినుంచి నేరుగా వెస్టిన్‌ హౌటల్‌ వెళ్తారు. 28న ప్రత్యేక కాన్వాయ్‌ లో రోడ్డు మార్గంలో హెచ్‌ ఐసీసీకి వెళ్లి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతారు. ఈ మేరకు తెలంగాణ ఇంటెలిజెన్సు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఇవాంక రాకకు నాలుగు రోజులు ముందుగానే అంటే మంగళవారం యుఎస్‌ అధ్యక్షుని కుటుంబ సభ్యుల రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ కమాండోలు నగరానికి రానున్నారు. ఇప్పటికే ఇవాంక సెక్యూరిటీకి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించాయి.

కాగా, ట్రంప్ త‌న‌య భారీ భ‌ద్ర‌త అమ‌లు ప‌ర్చ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వైట్‌ హౌస్‌ ప్రతినిధికి కల్పించే ప్రొటోకాల్‌ ఇవాంకకు అమలు చేయనున్నట్లు స‌మాచారం. భద్రత విషయంలో యుఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు కూడా డీజీపీకి స్పష్టమైన నోట్‌ పంపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వారికి సమాధానం అందిందని తెలుస్తోంది. మ‌రోవైపు ప‌ద్మావతి వివాదాల నడుమ గ్లోబల్‌ సమ్మిట్‌ కు బాలీవుడ్‌ నటి దీపికా పదుకుణే హాజరుకావాల్సి ఉన్నది. అయితే, ఆమె ఈ సదస్సు నుంచి తప్పుకున్నారు. దీపిక నటించిన పద్మావతి సినిమాపై వివాదం జ‌ర‌గ‌డం, దేశవ్యాప్తంగా డైరెక్టర్‌ సంజయ్‌ లీలా బన్సాలీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శలు కొనసాగుతున్నాయి. ఈ కారణాల వల్ల దీపిక ఈ సమ్మిట్‌కు హాజరుకావటంలేదని తెలంగాణ ప్రభుత్వ అధికారవ‌ర్గాల స‌మాచారం.