Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను మ‌ళ్లీ ఖుష్ చేసిన ఇవాంకా

By:  Tupaki Desk   |   19 Dec 2017 5:45 AM GMT
కేసీఆర్‌ ను మ‌ళ్లీ ఖుష్ చేసిన ఇవాంకా
X
హైదరాబాద్‌ లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ పెన్యూర్‌ సమ్మిట్ స‌క్సెస్ తీపిక‌బుర్ల జాబితాలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు మ‌రో అంశం తోడ‌యింది. జీఈఎస్ స‌క్సెస్‌ పై ప‌లు వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతుండ‌గా ఈ జాబితాలో తాజాగా అనూహ్య‌మైన అంశం చేరింది. జీఈఎస్ నిర్వ‌హ‌ణ ప‌ట్ల అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు వ్య‌క్తిగ‌తంగా ఆమె ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు లేఖ రాశారు. ఇందులో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం.

జీఈఎస్ సంద‌ర్భంగా తెలంగాణ ఇచ్చిన ఆతిథ్యానికి ఈ లేఖ‌లో ఇవాంకా కృతజ్ఞతలు చెప్పారు. `జీఈఎస్ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికన తీరు అనిర్వచనీయం - స్పూర్తిదాయకం. భవిష్యత్‌ లో అవకాశం దొరికితే మళ్లీ హైదరాబాద్‌ కు వస్తాను` అని అందులో పేర్కొన్నారు. జీఈఎస్ సాగుతున్న స‌మ‌యంలో ఫలక్‌ నామ ప్యాలస్‌ లో తెలంగాణ ప్రభుత్వం అందించిన కానుక గొప్ప అనుభూతిని కలిగించిందని ఇవాంకా సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ లేఖ కార‌ణంగా తెలంగాణ ప్ర‌భుత్వం - టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఖుష్ అవుతుండ‌టం గ‌మ‌నార్హం. కాగా, ఇటీవ‌లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి జీఈఎస్ సదస్సును విజయవంతంగా నిర్వహించార‌ని ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ వేదిక‌గా సాగిన ఈ స‌ద‌స్సును గ్రాండ్ స‌క్సెస్ చేశార‌ని ఇవాంకా త‌న‌తో వ్య‌క్తీక‌రించార‌ని ట్రంప్ ప్ర‌ధానితో చెప్పిన‌ట్లు పీఎంఓ వెల్ల‌డించింది.

కాగా, ట్రంప్‌-మోడీ ఫోన్ కాల్‌ - ప్ర‌స్తుతం ఇవాంకా లేఖ‌తో తెలంగాణ స‌ర్కారు హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ రాక‌తో త‌మ‌కు గుర్తింపు ద‌క్కింద‌ని - ఈ విష‌యంలో ప్ర‌ధాని మోడీతో ట్రంప్ ఫోన్ సంభాష‌ణ‌ - తాజాగా ఇవాంకా లేఖ ద్వారా హైద‌రాబాద్ ఖ్యాతీ - త‌మ ప‌రిపాల‌న‌కు మ‌రో కితాబు ద‌క్కింద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామం త‌మ స‌క్సెస్ జాబితాలో చేరుతుంద‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఖుష్ అవుతున్నాయి. అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేందుకు జీఈఎస్ తోడ్ప‌డింద‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా టీఆర్ ఎస్ యువ‌నేత‌ - మంత్రి కేటీఆర్‌ కు గుర్తింపు ద‌క్కేందుకు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.

జీఈఎస్ సదస్సులో వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా మంత్రి కేటీఆర్ వదులుకోకుండా తెలంగాణ అనుసరిస్తున్న విధానాల గురించి విపులాత్మకంగా చెప్పారని గుర్తు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక విధానాల గురించి వివరించడంలో మంత్రి కేటీఆర్ సఫలం అయ్యారని వివ‌రిస్తున్నారు.