Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆహ్వానం..హైద‌రాబాద్‌ కు ట్రంప్ కూతురు

By:  Tupaki Desk   |   27 July 2017 5:38 AM GMT
కేసీఆర్ ఆహ్వానం..హైద‌రాబాద్‌ కు ట్రంప్ కూతురు
X
డొనాల్డ్ ట్రంప్...అనూహ్య రీతిలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన స్వదేశీ అభిమాని. విభిన్న‌మైన రాజ‌కీయ‌వేత్త‌గా ఆయ‌న తీసుకుంటున్న ప్ర‌తీ నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారుతోంద‌న‌డంలో సందేహం లేదు. అలాంటి నిర్ణ‌యాల‌కు పెట్టింది పేర‌యిన ట్రంప్ త‌న ప‌రిపాల‌న‌లో కుమార్తె ఇవాంకాకు పెద్ద‌పీట వేసిన సంగ‌తి తెలిసిందే. షాడో అధ్య‌క్షురాలిగా ఇవాంకాను కొంద‌రు విమ‌ర్శ‌కులు ప్ర‌స్తావిస్తుంటారు. అలాంటి ఇవాంకా హైద‌రాబాద్‌కు రానున్నారు. అది కూడా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆహ్వానం మేర‌కు కావ‌డం విశేషం.

అమెరికా అధ్య‌క్షుడి కూతురు ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను కేసీఆర్ స్వ‌యంగా వివ‌రించారు. ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో స‌మావేశం అనంత‌రం కేసీఆర్ మీడియాతో ముచ్చ‌టిస్తూ హైదరాబాద్‌లో నవంబర్‌లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందుకు నరేంద్ర మోడీ అంగీకరించారని కేసీఆర్ వెల్లడించారు. ‘అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్యటన తేదీలు ఖరారు కాగానే, సదస్సు తేదీలు ప్రకటిస్తాం’ అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు తేదీలు ఖరారు కాగానే ప్రధాని పర్యటన కూడా ఖరారవుతుందని కేసీఆర్ వివరించారు. ప్రపంచ పెట్టుదారుల సదస్సును తెలంగాణ నిర్వహిస్తోందని, ఇందులో అమెరికా చురుకైన పాత్ర నిర్వహిస్తోందని అన్నారు. సదస్సుకు పలు దేశాలు హాజరవుతాయన్నారు.

ఇక త‌న భేటీలోని ఇత‌ర అంశాల గురించి ప్ర‌స్తావిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు కేసీఆర్‌ చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లపైనా ప్రధానితో చర్చించామన్నారు. ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి తదుపరి సమావేశంలో లోతుగా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతు సమస్యలు, ఎస్టీల విషయాలూ ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చాయని కేసీఆర్ వివరించారు.