Begin typing your search above and press return to search.

సంక్షేమానికి 10 శాతమే.. అంత‌కు మించితే క‌ష్ట‌మే.. ఐవైఆర్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   28 Jan 2022 3:30 PM GMT
సంక్షేమానికి 10 శాతమే.. అంత‌కు మించితే క‌ష్ట‌మే.. ఐవైఆర్ కామెంట్స్‌
X
ఏపీ స‌ర్కారుపై త‌ర‌చుగా నిశిత వ్యాఖ్య‌లు చేసే మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన అధికారి ఐవైఆర్ కృష్ణారావు తాజాగా మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండానే.. ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇంకెంత కాలం అప్పులు చేస్తార‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. అప్పుల మీద ఎంత‌కాలం బ‌తుకుతార‌ని.. ఆయ‌న నిల‌దీశారు. అంతేకాదు.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంక్షేమం అమ‌లు చేయ‌డం త‌ప్పుకాద‌న్న ఐవైఆర్‌.. దీనికి కూడా ఒక ప‌ద్ధ‌తి.. విధానం ఉండాల‌ని.. వ‌స్తున్న ఆదాయానికి, చేస్తున్న ఖ‌ర్చుకు మ‌ధ్య పొంతన ఉండాల‌ని ఆయ‌న అన్నారు.

తాజాగా ఏపీ స‌ర్కారు అప్పులు.. సంక్షేమంపై ఐవైఆర్ కొన్ని కామెంట్లు చేశారు. త‌ర‌చుగా త‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే ఆయ‌న‌.. అదేవిధంగా ఇప్పుడు కూడా స్పందించారు. ``అప్పులను కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల‌కు ఖ‌ర్చు చేస్తే.. ఎలా?`` అని ఏపీ స‌ర్కారును ఉద్దేశించి నిల‌దీశారు. కేవ‌లం ప్ర‌భుత్వం సంక్షేమంపైనే దృష్టి పెట్టినందున మౌలిక వ‌స‌తులు, ఇత‌ర అభివృద్ధి కార్య‌క్ర‌మాలు మ‌రుగున ప‌డిపోయాయ‌ని అన్నారు. ``కొత్త‌గా రోడ్లు వేసేందుకు.. కాదు.. అస‌లు ఉన్న రోడ్ల‌ను రిపేర్లు చేసేందుకు కూడా స‌ర్కారు వ‌ద్ద నిధులు లేవు., ఇలా అయితే.. ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధ‌మ‌వుతుంది`` అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు.

అయితే.. ప్ర‌భుత్వం పేద‌ల‌ను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం త‌ప్పుకాద‌ని.. ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. అధికారంలోకి వ‌స్తే.. తాము ఇచ్చిన హామీల మేర‌కు ఇలాంటివి చేస్తాయ‌ని చెప్పుకొచ్చారు. అయితే.. అప్పులు కూడా చేసి తెచ్చిన సొమ్ముతో సంక్షేమం అమ‌లు చేయ‌డ‌మే చిత్రంగా ఉంద‌ని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ``జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోంది. కేవ‌లం అప్పుల మీదే ఇంకెంతకాలం ఆధార‌ప‌డ‌తారో ఎవ‌రికీ తెలియదు. అంతేకాదు.. ఇదే విధానం కొన‌సాగితే.. ఇంకెంత అప్పు చేయాల్సి వ‌స్తుందో కూడా తెలియ‌దు. ఆ అప్పులు ఎలా తీరుస్తారో.. కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. క‌నీసం ఆ విష‌యాన్న‌యినా.. ప్ర‌భుత్వం చెప్పాలి. అప్పులు చేయ‌డ‌మే కాదు.. వాటిని తీర్చేందుకు స‌ర్కారు వ‌ద్ద‌.. ఏదైనా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ఉండాలి`` అని వ్యాఖ్యానించారు.