Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ జేఎఫ్‌ సీ..టీడీపీ బీ టీం

By:  Tupaki Desk   |   10 July 2018 1:30 AM GMT
ప‌వ‌న్ జేఎఫ్‌ సీ..టీడీపీ బీ టీం
X
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కల్పించిన హామీల అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం - ఆంధ్రప్రదేశ్‌ లోని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనల వల్ల ప్రజలలో గందరగోళం ఏర్పడడంతో వాస్తవాలను దృవీకరించడానికి జేఎఫ్‌సీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలో ఏర్పాటైన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ మొద‌లైంది. అయితే, ఏపీకి కేంద్రం ఏం ఇచ్చింది...విభ‌జ‌న హామీల‌ను ఎంత మేర‌కు నిల‌బెట్టుకుంది అనే అంశాన్ని తేల్చేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా ప్ర‌యోజ‌నం శూన్య‌మ‌ని మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..టీడీపీ చెప్తున్న వాద‌న‌నే ఆయ‌న వినిపించార‌ని ఐవైఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గుంటూరులో నవ్యాంధ్ర మేధావుల ఫోరం తరపున రాష్ట్ర విభజన అంశాలపై జరిగిన సెమినార్లో ఐవైఆర్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా జేఎఫ్‌సీ గురించి వివ‌రించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ - లోక్‌ స‌త్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ - సీనియర్ పార్లమెంటేరియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ - లోక్‌స‌భ మాజీ సభ్యులు కొణతాల రామకృష్ణ - సీపీఎం.ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మధు - సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ - కాంగ్రెస్ పార్టీకి చెంది శాసనమండలి మాజీ సభ్యుడు గిడుగు రుద్రరాజు - పీసీసీ కార్యదర్శి జంగా గౌతమ్ - మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ - ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావుతో కూడిన జేఎఫ్‌ సీ తేల్చిందేమీ లేద‌ని అన్నారు. ఆ నివేదిక కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టును ఆధారం చేసుకొని తయారుచేయబడిందని...అంతేతప్ప కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తీసుకోలేదని ఐవైఆర్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిందేంటి...రాష్ట్రం ఖ‌ర్చు చేసింది ఏమిట‌ని తేల్చేక్ర‌మంలో...కేంద్రం వాద‌న‌ను తీసుకులకోలేద‌ని గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకోనందువల్లే జేఎప్ఎఫ్‌సీ నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయని ఆయ‌న తేల్చేశారు.

ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వ‌ తీరును ఐవైఆర్ త‌ప్పుప‌ట్టారు. ``రాజకీయంగా పరిష్కరించుకోవాల్సిన అంశంపై కోర్టుకెక్కితే రెంటికి చెడ్డ రేవడి కావచ్చు. నా పరిజ్ఞానం మేరకు న్యాయపరంగా మనకు బలమైన కేసు ఉండకపోవచ్చు. విభజన చట్టం ఆ విధంగా తయారయింది. ఏ అధికారి కోర్టును తప్పుదోవ పట్టించేటట్లు అఫిడవిట్ వెయ్యరు. ఈ అంశాన్ని పునరాలోచించుకోవడం మంచిది`` అని ఐవైఆర్ విశ్లేషించారు.