Begin typing your search above and press return to search.
బీజేపీతో పొత్తుపై బాబుకు మాజీ ఐఏఎస్ ప్రశ్న
By: Tupaki Desk | 28 April 2018 1:27 PM GMTఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కలల ప్రాజెక్టు అయిన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఆయనపై పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దికాలం క్రితం నుంచి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఇందులోని పలు అంశాలను తప్పుపడుతున్నారు. తాజాగా రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ప్రణాళికలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆయన ఆక్షేపించారు. తాజాగా అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని రోజులుగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని, దీనివల్ల గందరగోళం నెలకొంటోందని వ్యాఖ్యానించారు.
ఇటీవలే "ఎవరి రాజధాని అమరావతి" పేరుతో 112 పేజీలతో పుస్తకం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో అనేక కీలక అంశాలను కృష్ణారావు ప్రస్తావించారు. గతంలోనే రాజధానికి అమరావతి ఎంపికను ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. తన పుస్తకంలోనూ అదే విషయాన్ని ఐవైఆర్ వివరించారు. అమరావతితో పోలిస్తే దోనకొండ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని, దొనకొండలో ప్రభుత్వ భూములతోపాటు అన్ని వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. రాజధాని ఎంపికలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకపోవడం సరికాదని ఐవైఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కొద్దికాలం క్రితం వర్షాలకు వచ్చిన వరద కంటే పదిరెట్లు ప్రమాదకర స్థాయిలో అమరావతిలో వరదలు వచ్చి మునిగే అవకాశముందని ఐవైఆర్ కృష్ణారావు హెచ్చరించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు తీవ్ర విఘాతం కలిగి భవిష్యత్తులో కాలుష్యం బారిన పడుతుందని అన్నారు. ఇన్ని అవరోధాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ముందుకెళుతోందని విమర్శించారు. వీటికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన మరోమారు క్లారిటీ ఇచ్చారు.
తన పుస్తకం గురించి ఆయన వివరణ ఇస్తూ అందులో పేర్కొన్న అన్ని అంశాలకు తాను కట్టుబడి ఉన్నానని ఐవైఆర్ స్పష్టం చేశారు. రాజధాని స్థలం ఎంపిక, నిర్మాణం వంటి అంశాల గురించి తాను సన్నిహితంగా చూసిన అంశాలను అందులో పేర్కొనట్లు ఐవైఆర్ స్పష్టం చేశారు. వాటికి తాను కట్టుబడి ఉన్నానని, భశిష్యత్‌లో ఇంకో పుస్తకాన్ని రాయబోతున్నానని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాజకీయ విధానాలను సైతం ఐవైఆర్ తప్పుపట్టారు. బీజేపీ పొత్తుతో లాభం జరిగిందని నాలుగేళ్లు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు నష్టపోయామని చెబుతున్నారని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. కాగా, రాజధాని నిర్మాణం కోసం రాజమౌళి లాంటి దర్శకులను సంప్రదించడం ఏమిటని, అసలు రాజధాని నిర్మాణానికి దర్శకులెందుకని గతంలో ఐవైఆర్ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం అంటే సినిమా సెట్టింగులా అని నిలదీసిన ఐవైఆర్ డిజైన్ల ఖరారులోనే ఇంత సుదీర్ఘ సమయం గడిచిపోతే...ఇక నిర్మాణం ఎప్పుడవుతుందని కూడా ప్రశ్నించారు.