Begin typing your search above and press return to search.

ఐవైఆర్‌ కు గ‌వ‌ర్న‌ర్ ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   21 Jun 2017 5:40 PM GMT
ఐవైఆర్‌ కు గ‌వ‌ర్న‌ర్ ఏం చెప్పారు?
X
సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టుల‌తో సంచ‌ల‌నం సృష్టించి.. పెను క‌ల‌క‌లాన్నే రేపారు ఏపీ మాజీ సీఎస్..ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ఐవైఆర్ కృష్ణారావు. నిజానికి ఎప్పుడో పెట్టిన పోస్టుల‌కు ఆల‌స్యంగా నిద్ర లేచిన చంద్ర‌బాబు స‌ర్కారు హడావుడిగా చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అయితే.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌న‌పై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన ఏపీ స‌ర్కారు తీరును త‌ప్పు ప‌డుతూ ప్రెస్ మీట్ పెట్టేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు బాబు స‌ర్కారుకు మంట పుట్టించేలా చేశారు. సోష‌ల్ మీడియాలో పోస్టుల మీద అప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఎప్పుడైతే మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారో.. ఆ స‌మావేశం ముగిసి ముగియ‌గానే ఆయ‌న‌పై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. బాబు స‌ర్కారు తీరుపై ఐవైఆర్ గుర్రుగా ఉన్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఆయ‌న ఫిర్యాదు చేసేందుకు గ‌వ‌ర్న‌ర్ తో భేటీ కావ‌టం స‌ర్వ‌త్రా ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో భేటీ త‌ర్వాత మీడియాతో మాట్లాడ‌కుండా ఐవైఆర్ వెళ్లిపోయారు. ఆయ‌న‌తో గ‌వ‌ర్న‌ర్ ఏం చెప్పార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉంటే.. ఐవైఆర్‌పై వేటువేస్తూ బాబు స‌ర్కారు విడుద‌ల చేసిన ఆదేశాల్లో కొన్ని త‌ప్పులు ఉండ‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో ఇచ్చిన జీవోల తేదీలు త‌ప్పుగా చూపించ‌టంతో.. వాటిని స‌వ‌రిస్తూ మ‌రో ఉత్త‌ర్వును విడుద‌ల చేశారు. అదే స‌మ‌యంలో ఐవైఆర్ స్థానంలో టీడీపీలో మొద‌టినుంచి ఉన్న వేమూరి ఆనంద‌సూర్య‌కు నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఐవైఆర్‌ను బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గానూ.. ఆర్చ‌క సంక్షేమ నిధికి ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. తాజా ఎపిసోడ్ లో ఆయ‌న్ను రెండు ప‌ద‌వుల నుంచి తొల‌గించారు. అదే స‌మ‌యంలో ఆయ‌న స్థానంలో నియ‌మించిన ఆనంద సూర్య‌ను కేవ‌లం బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. మ‌రి.. ఆర్చ‌క సంక్షేమ నిధి ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు ఎవ‌రికి అప్ప‌గిస్తార‌న్న‌ది అందులో పేర్కొన‌లేదు. ఇక‌.. గ‌వ‌ర్న‌ర్ తో భేటీ సంద‌ర్భంగా ఐవైఆర్‌కు కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. తొంద‌ర‌పడి మాట్లాడొద్ద‌ని.. మౌనంగా ఉండాల‌ని ఆయ‌న పేర్కొన్న‌ట్లుగా స‌మాచారం. ఈ కార‌ణంతోనే నిన్న మీడియాతో అంత మాట్లాడిన ఆయ‌న‌.. ఈ రోజు అందుకు భిన్నంగా ఏమీ మాట్లాడ‌కుండా వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/