Begin typing your search above and press return to search.

జగన్ సర్కారు పరువును బజారున పడేసిన ఐవైఆర్!

By:  Tupaki Desk   |   23 Feb 2022 5:30 PM GMT
జగన్ సర్కారు పరువును బజారున పడేసిన ఐవైఆర్!
X
వ్య‌వ‌స్థ గురించి విశ్లేషించాలంటే అందులో భాగ‌మైన వారు, కీల‌క స్థాయిలో ఉన్న వారిని మించిన వారెవ్వ‌రు ఉండ‌రు. అలా ఏపీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో భాగ‌మై అనంత‌రం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు తాజాగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

సంక్షేమ ప‌థ‌కాల‌కు జ‌గ‌న్ త‌న సొంత డ‌బ్బు తెచ్చి పంచ‌డం లేద‌ని, ల‌బ్ధిదారుల్లో జ‌మ అవుతున్న డ‌బ్బు అంతా అప్పు ద్వారా తెచ్చిన సొమ్మేన‌ని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ స‌ర్కారు సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం చేస్తున్న అప్పులు భ‌విష్య‌త్తులో ఏపీ ప్ర‌జ‌ల‌పైనే ప‌డ‌నున్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ స‌ర్కారు తీరు చూస్తుంటే బెండు అప్పారావు సినిమా గుర్తుకు వ‌స్తోందంటూ సెటైర్లు వేశారు.

బీజేపీ స‌ల‌హాదారుగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ` 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేసిన కేంద్ర బడ్జెట్‌ .. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం' అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

`కేంద్ర బడ్జెట్‌ చూస్తే బడ్జెట్ ఎలా రూపొందించాలి అనేది తెలుస్తుంది... ఏపీ బడ్జెట్‌ చూస్తే బడ్జెట్‌ ఏ విధంగా రూపొందించకూడదు అనేది తెలుస్తుంది` అని కామెంట్ చేశారు. ఏపీ బడ్జెట్‌కు పారదర్శకత అనేది లేదు అని ఐవైఆర్‌ కృష్ణారావు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీ ప్ర‌భుత్వం త‌న బ‌డ్జెట్ లో రూ.37 వేల కోట్ల‌ను అప్పుగా ప్ర‌తిపాదించి, ఆ వెంట‌నే రూ.57 వేల కోట్ల‌ను అప్పుగా తెచ్చి అప్పు భారాన్ని అమాంతంగా పెంచేశార‌న్నారు. వ్యక్తి అయినా, సంస్థ అయినా, ప్రభుత్వం అయినా ఆదాయాలు చూసుకోకుండా డబ్బు ఖర్చు పెడితే బాగుపడటం జ‌ర‌గ‌ని పని అంటూ ఏపీ ప్ర‌భుత్వానికి ఐవైఆర్ చుర‌క‌లు అంటించారు.

ఆరేళ్లలో ఏపీకి ద‌క్కిన‌న్ని నిధులు మ‌రే రాష్ట్రానికి ఇవ్వలేదని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. లోటు బడ్జెట్‌ వల్ల ఏపీ నుంచి కేంద్రానికి వెళ్లే పన్నులు తక్కువేనని వివ‌రించారు.

ఇలాంటి ముఖ్య‌మైన విష‌యాల‌ను ప్రాంతీయ పార్టీల నేత‌లు వెల్ల‌డించ‌ర‌ని విమ‌ర్శ‌లు చేశారు. ప్రాంతీయ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. అబద్దాలు ప్రచారం చేసే పార్టీలు చర్చకు సిద్ధంగా ఉండాలని ఆయ‌న సవాల్‌ విసిరారు.