Begin typing your search above and press return to search.

ఈ లేఖతో బాబు బండారం బయటకు!

By:  Tupaki Desk   |   1 Nov 2017 5:36 PM GMT
ఈ లేఖతో బాబు బండారం బయటకు!
X
చంద్రబాబు జమానాలో చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గిరీ దక్కించుకుని, ఆ తర్వాత రాజీనామా చేసి... చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టిన ఐవైఆర్ కృష్ణారావు తాజాగా మళ్లీ తెరమీదకు వచ్చారు. ఆయన కొత్తగా కేంద్రం ఎన్నికల సంఘానికి రాసిన లేఖ బహుధా వివాదాస్పదం అవుతోంది. ఈ లేఖలో ఆయన నేరుగా చంద్రబాబునాయుడు పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. ఇందులోని ఆరోపణలు చంద్రబాబు మెడకు చుట్టుకుంటాయనే పలువురు భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ లేఖను సీరియస్ గా తీసుకుంటే గనుక.. చంద్రబాబు ప్రభుత్వానికి చిక్కులు తప్పవని కూడా అనుకుంటున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి భన్వర్ లాల్ పదవీ విరమణ చేసిన అక్టోబరు 31వ తేదీన ఏపీ ప్రభుత్వం ఆయనకు ఓ నోటీసును కానుకగా ఇచ్చింది. గతంలో ఎన్నో సంవత్సరాల కిందట ఆయన కలెక్టరుగా చేసిన రోజుల్లో ఆయన వ్యవహారంపై నమోదు అయిన కేసు అది. దానికి సంబంధించి.. ఇప్పుడు నోటీసు ఇచ్చారు. ఈ కేసు పెండింగ్ లో ఉండడం వల్ల.. ఇప్పుడు భన్వర్ లాల్ కు రిటైర్మెంటు బెనిఫిట్స్ అన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అయితే భన్వర్ లాల్ పై ఇదంతా చంద్రబాబునాయుడు సర్కారు కుట్ర అనే ఆరోపణలు కూడా బహుధా వినిపిస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా కృష్ణారావు రాసిన లేఖ మరో ఎత్తుగా కనిపిస్తోంది.

ఎన్నికల అధికార్లుగా పనిచేసే వారి మీద ప్రభుత్వాలు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంటే గనుక.. భవిష్యత్తులో ఎన్నికల కమిషన్ అనేక చిక్కుల్లో పడుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల అధికారిగా పనిచేయడానికి ఐఏఎస్ లు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉండదని తెలిపారు. తాజాగా భన్వర్ లాల్ కు ఇచ్చిన నోటీసుల విషయంలో ఎన్నికల సంఘం ఆయనకు బాసటగా నిలిచి.. న్యాయపోరాటం ద్వారా అయినా మద్దతు తెలియజేయాలని కృష్ణారావు కోరుతున్నారు.

భన్వర్ లాల్ విషయంలో చంద్రబాబు సర్కారు ఇన్నాళ్లూ మిన్నకుండిపోయి.. ఆయన రిటైర్మెంటు వేళ ఎందుకు స్పందించిందో.. ఆయన ప్రయోజనాలు దెబ్బతినేలా ఎందుకు వ్యవహరించిందో.. ఐవైఆర్ లేఖతో బాబు బండారం మొత్తం బయటకు వస్తుందని ఐఏఎస్ వర్గాలు భావిస్తున్నాయి.