Begin typing your search above and press return to search.

అరే.. జేడీ శీలంకు ఎంత కోపం వచ్చేసింది

By:  Tupaki Desk   |   11 Aug 2015 9:04 AM GMT
అరే.. జేడీ శీలంకు ఎంత కోపం వచ్చేసింది
X
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా.. ఏపీ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా జేడీ శీలం అందరికి సుపరిచితులు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఆయన గారి గురించి సామాన్యులకు తెలిసింది కాస్త తక్కువే. కానీ.. ఢిల్లీ స్థాయిలో ఆయనున్న పరపతి గురించి మాత్రం రాజకీయ పక్షాలకు సుపరిచితమే. యూపీఏ సర్కారు అధికారంలో ఉన్న పదేళ్లలో ఆయన హవా ఎంతలా నడిచేదో కాంగ్రెస్ నేతలందరికి తెలుసు..

కాంగ్రెస్ అధినాయకత్వానికి చాలా సన్నిహితంగా ఉండే ఆయన.. సోనియమ్మ అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేయించటంలో దిట్టగా చెబుతారు. పలు చిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆయనతో మాట్లాడుకొని సోనియమ్మ దర్శనానికి ఏర్పాట్లు చేసుకునే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఆయన.. తన సొంత రాష్ట్ర విభజన సందర్భంగా చేష్టలుడిగిపోయినట్లుగా వ్యవహరించారు. కనీసం.. విభజన కారణంగా ఏపీకి జరిగే నష్టాన్ని వీలైనంతగా తగ్గించేలా అస్సలు ప్రయత్నించలేదన్న విమర్శ ఉంది. విభజన ఎపిసోడ్ మొత్తంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి మాత్రమే అండగా ఉన్న ఆయన.. ఏపీ ప్రయోజనాల గురించి అస్సలు పట్టించుకోలేదన్న ఆరోపణ ఉంది.

అలాంటి ఆయనకు తాజాగా విపరీతమైన కోపం వచ్చేసింది. పీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయానికి సంబంధించి మోడీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై ప్రశ్నించిన ఆయన.. రాజ్యసభలో రగిలిపోయారు.

రాజ్యసభలో తన స్థానం నుంచి గొంతు చించుకొని మాట్లాడిన ఆయన.. ప్రత్యేక హోదా కోసం ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని.. అయినా కేంద్రం ఇంకా కళ్లు తెరవలేదన్నారు. సభలో నాడు ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి విలువ లేదా? అంటూ ప్రశ్నించిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా.. రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం సహకరిస్తుందా? లేదా? అని సూటిగా అడిగారు.

విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అందరం కలిసి తీసుకున్న నిర్ణయానికే విలువ లేకపోతే.. ప్రజాస్వామ్యంపై నమ్మకాలు తొలిగినట్లేనని అగ్రహంగా మాట్లాడిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదాపై తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పటికే రెండు సార్లు లేఖలు రాసిన విషయాన్ని వెల్లడించారు.

రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదా గురించి తీవ్ర అగ్రహంతో మాట్లాడిన ఆయన.. పార్లమెంటు బయట.. జగన్ తీరును తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ అనంతపురం వచ్చిన తర్వాత మాత్రమే జగన్ కు ఏపీ ప్రత్యేక హోదా విషయం మీద మాట్లాడుతున్నారని.. మోడీతో సంబంధాలు పెట్టుకున్నందువల్లే ఆయన ప్రత్యేక హోదా గురించి పెదవి విప్పలేదన్నారు.