Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేక పోయా... క‌లెక్ట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   28 Dec 2021 1:41 PM GMT
ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేక పోయా... క‌లెక్ట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం
X
సాధార‌ణంగా ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎవ‌రైనా.. జీతం రాళ్ల కోస‌మే ప‌నిచేస్తారు. ప‌రిస్తితి ఎలా ఉన్నా.. తాము ఏం చేశామో.. చేయ‌లేదో.. అని చూడ‌కుండా.. స‌మ‌యానికి జీతం ప‌డితే చాల‌ని అనుకుంటారు. ఇది క‌లెక్ట‌ర్ నుంచి బిల్లు క‌లెక్ట‌ర్ వ‌ర‌కు అంద‌రూ అనుకునే మాట‌.. పాటించే సూత్రం. ప‌ని చేశామా.. లేదా.. అనేదాంతో సంబంధం లేకుండా.. జీతం తీసుకునేవారే! అయితే.. ఆ జిల్లా క‌లెక్ట‌ర్ మాత్రం చాలా డిఫ‌రెంట్‌! ప‌నిచేయ‌కుండా.. జీతం ఎలా తీసుకుంటాం! అనే టైపు. అందుకే.. ఆయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేక‌పోయాన‌నే ఆవేద‌న‌తో.. ఈ నెల జీతం త‌న‌కు వ‌ద్దంటూ.. సిబ్బందికి స‌మాచారం పంపించారు. మ‌రి ఈ డిఫరెంట్ క‌లెక్ట‌ర్ గురించి.. తెలుసుకుందామా?!

మధ్యప్రదేశ్ జబల్పుర్ జిల్లా కలెక్టర్ కరంవీర్ శర్మ. నెలలు గడిచినా ప్రజా ఫిర్యాదులను పరిష్కరించలేకపోయినందుకు తనకు డిసెంబర్ నెలకు వచ్చే జీతాన్ని నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. 100 రోజులు దాటినా సీఎం హెల్ప్లైన్కు అందిన ఫిర్యాదులు ఇంకా అలానే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు ఇతర అధికారుల వేతనాలను కూడా ఆపాలని జిల్లా కోశాధికారికి సూచించారు. కలెక్టర్ కరంవీర్ శర్మ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సీఎం హెల్ప్లైన్కు వచ్చిన ఫిర్యాదులు 100 రోజులు దాటినా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన దృష్టికి వచ్చింది. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, ఫిర్యాదు అందగానే నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని తేల్చి చెప్పారు. ఒక్క ఫిర్యాదును కూడా వదిలివేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించనందుకు ఇతర అధికారులతో పాటు స్వచ్ఛత, హెల్ప్లైన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ల జీతాలను కూడా నిలిపివేయాలని జిల్లా కోశాధికారిని కలెక్టర్ ఆదేశించారు. అంతేగాక రెవెన్యూ కేసుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నందుకు తహశీల్దార్ల ఇంక్రిమెంట్లను కూడా ఆపాలని కలెక్టర్.. అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశానికి హాజరుకానందుకు జిల్లా మార్కెటింగ్ అధికారికి షోకాజ్ నోటీసులు పంపించారు.

సీఎం హెల్ప్ లైన్, సమాధాన్కు వచ్చిన ఫిర్యాదులను పరిమిత కాలంలో, 100 రోజులకుపైగా పెండింగ్లో ఉన్న సమస్యలను డిసెంబర్ 31లోగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ శర్మ హుకుం జారీ చేశారు. ప్ర‌స్తుతం క‌లెక్ట‌ర్ జీతం వ‌ద్ద‌న్న ఆదేశాలు.. దేశ‌వ్యాప్తంగా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. `మా మంచి క‌లెక్ట‌ర్` అంటూ జ‌బ‌ల్పూర్ వాసులు కొనియాడుతుండ‌గా.. సూప‌ర్ సార్‌.. మీలాంటి వారు ఆద‌ర్శంగా నిలిచిపోతార‌ని.. నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.