Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉంది: ఉద్యోగుల సంఘం నేత సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   16 Oct 2022 11:30 PM GMT
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉంది: ఉద్యోగుల సంఘం నేత సంచలన వ్యాఖ్యలు!
X
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉందని.. దాన్ని తట్టుకోలేక ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు హాట్‌ కామెంట్స్‌ చేశారు. ముఖ్యంగా సచివాలయాల ఉద్యోగుల మీద విపరీతమైన పని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఈ ఒత్తిడి భరించలేక దురదృష్టవశాత్తూ ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని బొప్పరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ఏపీ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంక్షేమ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం జరిపామని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించామని వివరించారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ 27న ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ ప్లీనరీ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఉద్యోగులపై ఒత్తిడి తట్టుకోలేక గతంలో ఓ చోట సర్వేయర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని బొప్పరాజు గుర్తు చేశారు. ఇలాగే చాలా మంది ఉద్యోగులు పని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి విషయంలో గ్రామ, వార్డు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని విమర్శించారు. నిబంధనల ప్రకారం పని చేయించాలి కానీ ఒత్తిడి తెచ్చి పని చేయించడం కరెక్ట్‌ కాదని చెప్పారు. ఇంత ఒత్తిడి తెచ్చి పనిచేయించేటప్పుడు ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదని బొప్పరాజు నిలదీశారు.

అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను డిక్లరేషన్‌ చేయకుండా ఏడాదిపాటు కాలయాపన చేశారని బొప్పరాజు మండిపడ్డారు. డిసెంబర్‌ 2020 రెండో నోటిఫికేషన్‌ ద్వారా కొంతమంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగంలో చేరారన్నారు. వీరిని వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 27న విజయవాడలో భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని వివరించారు. ఆరోజే నూతన కమిటీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.