Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది?

By:  Tupaki Desk   |   2 Nov 2015 7:17 AM GMT
కేసీఆర్‌ కు ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నికల స‌మ‌యంలో ఇచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు హామీ ఇపుడు ఆ రాష్ర్టంలో చిచ్చురేపుతోంది. జిల్లాల ఏర్పాటుకు అడుగులు వేస్తుండ‌గా... దాదాపు అన్ని జిల్లాల్లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం నేతలను, రాజకీయ పార్టీలను ఇరకాటంలో పడేయడంతో స్థానికంగా పట్టుకోసం గ్రూపులుగా విడిపోయి వేర్వేరుగా డిమాండ్లతో ప్రభుత్వపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన బాట పడుతున్నారు.

తెలంగాణ‌లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో నోరు మెదకపోతే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందేమోనన్న దిగులుతో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు సైతం ఇతర పార్టీలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీల్లో భాగస్వామ్యమవుతున్నారు! ఈ పరిణామాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. దీంతో....కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇంకా అధ్యయన దశలో ఉందని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి స‌న్నిహిత వ‌ర్గాలు పార్టీ శ్రేణుల‌కు వివ‌రించి చెప్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్లతో ఆందోళనలు ఊపందుకుని ఉధృతంకాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి స్థాయి వ్య‌క్తుల నుంచే ప్రకటనలు చేయడం, చిచ్చు తీవ్రతకు అద్దం పడుతుంది. కొత్త జిల్లాల అధ్యయనానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

నల్లగొండ జిల్లాలోని భువనగిరి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటుచేసి, రంగారెడ్డి జిల్లాలోని ఎల్‌బి నగర్ - ఉప్పల్ - మలక్‌ పేట నియోజకవర్గాలను అందులో కలుపబోతున్నారన్న సమాచారంతో ఆందోళనకు గురైన మూడు నియోజకవర్గాలకు చెందిన రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడ్డారు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారు. వీరంతా రెండురోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసి, తమ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే భువనగిరి జిల్లాలో కలుపవద్దని వినతిపత్రాన్ని సమర్పించారు. భువనగిరిని కాకుండా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అందులో తమ నియోజకవర్గాలను కలిపితే అభ్యంతరం లేదని సీఎస్‌ ను కలిసిన జెఎసి స్పష్టం చేసింది. భువనగిరిలో కలిపితే మాత్రం ఊరుకునేది లేదని జేఏసీ హెచ్చరించింది.

తెలంగాణ ఉద్య‌మం సంద‌ర్బంగా కేసీఆర్ వ‌ల్ల‌ పెద్ద ఎత్తున కొన‌సాగిన జేఏసీల జోరు ఇపుడు అదే కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఏర్ప‌డ‌టం ఆస‌క్తిక‌రం.