Begin typing your search above and press return to search.

ఇంతకీ ఎవరికి ఎవరు కోవర్టులు ?

By:  Tupaki Desk   |   17 Feb 2022 10:30 AM GMT
ఇంతకీ ఎవరికి ఎవరు కోవర్టులు ?
X
ఇపుడిదే విషయం జనాలకు ఎవరికీ అర్ధం కావటం లేదు. తెలంగాణ రాజకీయాల్లో కోవర్టుల గోల రోజురోజుకు పెరిగిపోతోంది.

మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ నేతే కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతే కానీ రేవంత్ ను అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడిని చేసిందంటు మండిపోయారు.

రేవంత్ ముమ్మాటికి తెలుగుదేశంపార్టీ కోవర్టేనట. రేవంత్ టీడీపీ కోవర్టన్న విషయాన్ని తాను కొత్తగా చెప్పటం లేదని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెప్పారంటు మంత్రి చెప్పారు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోడీకి కేసీయార్ కోవర్టన్న విషయం తెలిసిందే. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేసీయార్ ను మళ్ళీ గెలిపించేందుకు నరేంద్ర మోడీ, అమిత్ షా శక్తికొద్దీ ప్రయత్నిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ఒకవైపు కేసీఆర్ అవినీతి మీద తమ దగ్గర అన్నీ ఆధారాలున్నాయని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అండ్ కో చెబుతున్నపుడు ఇంకా ఎందుకని యాక్షన్ తీసుకోవటం లేదని రేవంత్ ప్రశ్నించారు.

నిజంగానే కేసీఆర్ అవినీతిపై ఆధారాలుంటే యాక్షన్ తీసుకోవటానికి కేంద్రానికి వచ్చిన సమస్య ఏమిటో చెప్పాలని నిలదీశారు. కేసీయార్ అవినీతిపై తమ దగ్గర ఆధారాలున్నాయని గడచిన రెండేళ్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారే కానీ కనీసం విచారణ కూడా చేయించలేకపోతున్నారని రేవంత్ అన్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కేసీయార్ బీజేపీ కోవర్టు కావటమే అని కుండబద్దలు కొట్టకుండా చెప్పారు.

రేవంత్ ప్రశ్నలకు కమలనాథుల నుంచి ఎలాంటి సమాధానం ఉండటం లేదు. ఎప్పటికప్పుడు కేసీయార్ అవినీతి చిట్టా తమ దగ్గరుందని బీజేపీ చీఫ్ చెప్పటమే కానీ కనీసం విచారణ కూడా చేయించలేకపోతున్నది నిజం. మరో వైపు చంద్రబాబునాయుడుతో రేవంత్ ఇంకా సన్నిహిత సంబంధాలను కంటిన్యు చేస్తునే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం మీద వీళ్ళ ఆరోపణలు కాదుకానీ అసలు ఎవరి ఏ పార్టీకి కోవర్టులో అర్ధంకాక జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.