Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ శత జయంతి వేళ జగన్ భారీ గిఫ్ట్... ?

By:  Tupaki Desk   |   25 Jan 2022 8:42 AM GMT
ఎన్టీయార్ శత జయంతి వేళ  జగన్  భారీ గిఫ్ట్... ?
X
తెలుగు వేరి ఇల వేలుపు, వెండి తెర వెలుగు, రాజకీయ దురంధరుడు అయిన ఎన్టీయార్ శత జయంతి సంవత్సరం ఇది. ఒక విధంగా తెలుగు వారికి అతి పెద్ద పండుగ. అంతకు మించి తెలుగుదేశం పార్టీకి వేడుక. దీని మీద తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో తెలియదు. ఈ మధ్యనే తెలంగాణా ప్రభుత్వం మాజీ ప్రధాని అపర చాణక్యుడు పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించి శభాష్ అనిపించుకుంది.

ఇక ఎన్టీయార్ విషయంలో అయితే టీడీపీతో పాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాలని తెలుగు జాతి అంతా కోరుకుంటోంది. ఇక ఏపీ సర్కార్ కి ఈ విషయంలో మరింత ఎక్కువ బాధ్యత ఉంది అన్నది అంతా అంగీకరిస్తారు. అన్న గారు క్రిష్ణా జిల్లా వాసి. అఖిలాంధ్రుల ముద్దు బిడ్డ. అందువల్ల రాజకీయాలకు అతీతంగా ఆయన శత జయంతి వేళ ఏపీ సర్కార్ ఏదైనా బృహత్తర కార్యక్రమం తలపెడితే అది తెలుగు జాతికే గర్వంగా ఉంటుంది.

మరి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఎన్టీయార్ అభిమాని అన్నది తెలిసిందే. అందుకే ఎన్టీయార్ శత జయంతి వేళ ఆయనకు భారీ గిఫ్ట్ నే జగన్ రెడీ చేస్తున్నారు అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా అన్న గారికి సరైన అంజలి ఘటించాలన్నది కూడా జగన్ ఆలోచనగా ఉందిట. ఏపీలో ఎన్టీయార్ పుట్టిన క్రిష్ణా జిల్లాను రెండు గా విభజించనున్నారు. అలా విభజించిన తరువాత ఒక జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టడం ద్వారా అన్న గారి కీర్తిని శాశ్వతం చేయాలని జగన్ తలపోస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఆ విధంగా ఎన్టీయార్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూనే రాజకీయంగా కూడా టీడీపీ మీద పై చేయి సాధించాలన్నది వైసీపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. చంద్రబాబు ఇప్పటికి పద్నాలుగేళ్ల పాటు సీఎం గా వ్యవహరించారు కానీ ఆయన ఏ రోజూ ఎన్టీయార్ పేరిట సాలిడ్ గా ఒక కార్యక్రమం చేయలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక ఎన్టీయార్ తనయ పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉండగా పార్లమెంట్ లో అన్న గారి విగ్రహం ఏర్పాటు చేయించారు అన్నది తెలిసిందే.

అది కూడా కాంగ్రెస్ ఏలుబడిలో సాగింది. ఇపుడు జగన్ హయాంలో ఎన్టీయార్ పేరిట ఒక కొత్త జిల్లా వస్తే ఆ సామాజికవర్గం నుంచి ఎంతో కొంత సానుకూలత వైసీపీకి టర్న్ అవుతుంది అన్న దూరాలోచన కూడా ఉంది అంటున్నారు. మొత్తానికి రాజకీయాలు ఎలా ఉన్నా ఎన్టీయార్ పేరిట జిల్లా ఏర్పాటు అయితే మాత్రం కోట్లాది మంది తెలుగు వారు హర్షిస్తారు అన్నది నిజం.