Begin typing your search above and press return to search.

కేంద్రం కరెక్టే కానీ రాష్ట్రాలకే అధికారం ఉండాలన్న జగన్

By:  Tupaki Desk   |   29 Jan 2022 7:30 AM GMT
కేంద్రం కరెక్టే కానీ రాష్ట్రాలకే అధికారం ఉండాలన్న జగన్
X
కేంద్రం వాదన కరెక్టే కానీ ఆ అధికారం రాష్ట్రాలకే ఉండాలంటు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీసు అధికారుల సర్వీసు నిబంధనల సవరణల విషయంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదం జరుగుతోంది. కేంద్రంలో పనిచేసేందుకు ఐఏఎస్ అధికారుల కొరత ఎక్కువైపోతోందట. అందుకని రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను డిప్యుటేషన్ పై తీసుకునే అధికాలను కేంద్రం తీసుకునేందుకు వీలుగా కొత్తగా నిబంధన రూపొందించింది.

ఆ నిబంధన ఏమిటయ్యా అంటే రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ లను కేంద్రం అవసరమైపుడల్లా డిప్యుటేషన్ పై పిలిపించుకోవచ్చు. ఇపుడున్న నిబంధన ఏమిటంటే రాష్ట్రప్రభుత్వాలతో సంప్రదింపుల ద్వారా మాత్రమే డిప్యుటేషన్ పై అధికారులు వెళ్ళగలరు. ఒకవేళ ఐఏఎస్ లను డిప్యుటేషన్ పై కేంద్రానికి పంపటానికి రాష్ట్రాలు అంగీకరించకపోతే కేంద్రం చేయగలిగేదేమీ లేదు. అందుకనే ఐఏఎస్ అధికారుల సర్వీసు నిబంధనల్లోనే మార్పులు తేవాలని మోడి సర్కార్ డిసైడ్ చేసింది.

సర్వీసు నిబంధనల్లో గనుక సవరణలు జరిగితే ఇకపైన కేంద్రం ఏ ఐఏఎస్ అధికారిని డిప్యుటేషన్ మీద పంపాలంటే రాష్ట్రం పంపాల్సిందే తప్ప వేరే దారిలేదు. సంప్రదింపులు లేవు ఆదేశాలు మాత్రమే ఉంటాయి. ఈ సవరణలపై అభిప్రాయాలు చెప్పమని కేంద్రం అన్నీ రాష్ట్రాలను అడిగింది. అయితే 9 నాన్ బీజేపీ ప్రభుత్వాలు వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పాయి. తమిళనాడు, బెంగాల్, ఒడిస్సా, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, రాజస్ధాన్, తెలంగాణా, మహారాష్ట్ర ల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించారు. 8 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ మద్దతు తెలుపుతాయి.

అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్పే అభిప్రాయం కోసమే మిగిలిన వాళ్ళు చూస్తున్నారు. ప్రధానికి జగన్ రాసిన లేఖలో డిప్యుటేషన్ కోసం సర్వీసు నిబంధనలను మార్చటంపై కేంద్రానికి మద్దతు తెలిపారు. ఇదే సమయంలో ఎవరిని డిప్యుటేషన్ పంపాలనే అధికారం రాష్ట్రాలకే ఉండాలని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఐఏఎస్ అధికారుల పనితీరు రాష్ట్రాలకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ అధికారం రాష్ట్రాలకే ఉండాలన్నారు.

జగన్ రాసిన లేఖ బాగానే ఉంది. నూరుశాతం కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాకుండా అలాగని పూర్తిగా సరెండర్ అయిపోయినట్లు కాకుండా ఉంది. తన అభిప్రాయాన్ని చెబుతునే తీసుకురావాల్సిన సవరణలను స్పష్టంగా చెప్పటం మంచిగానే ఉంది. కాకపోతే కేంద్రం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.