Begin typing your search above and press return to search.

హామీ ఏమైంది బాసూ... మాజీ మంత్రులలో అసహనం!

By:  Tupaki Desk   |   1 Sep 2022 7:35 AM GMT
హామీ ఏమైంది బాసూ... మాజీ మంత్రులలో అసహనం!
X
మాజీ మంత్రులకు నామినేటెడ్ పదవులు అంటూ వైసీపీ అధినాయకత్వం ఊరించి అయిదు నెలల కాలం ఇట్టే గడచిపోయింది. పదవులు వస్తాయని కళ్ళు కాయలు కాచేలా చూసిన వారు ఇపుడు అసహనంతో రగులుతున్నారుట. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మంత్రి వర్గ విస్తరణను జగన్ చేపట్టారు. నాడు చాలా మంది మంత్రులను తీసేశారు. అయితే వారికి ఓదార్పుగా నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు. దాని వల్ల వారికి అధికార హోదా ఉంటుందని, ప్రోటోకాల్ సమస్యకు కూడా ఇబ్బంది రాకుండా ఉంటుందని నచ్చచెప్పారు.

మంత్రి పదవికి ఏదీ సాటి రాకపోయినా చాలా మంది మాజీలు ఏదో ఒకటి అని సర్దుకుందామనుకున్నారు. అయితే ఇప్పటికి అయిదు నెలలు గడచినా ఆ పదవుల ఊసు లేదు. జిల్లా అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని నాడు వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా ప్రచారం సాగింది. ఈ పదవులలో చైర్మన్లుగా మాజీ మంత్రులు ఉంటారని, వారికి క్యాబినేట్ హోదా దక్కుతుందని కూడా ఆశలు కల్పించారు.

తీరా చూస్తే ఆ పదవులు అటకెక్కాయా అన్న చర్చ అయితే వస్తోంది. దానికి కారణం ఆ మాటే ఇపుడు ఎక్కడా గట్టిగా వినిపించకపోవడమే. నిజానికి రాష్ట్ర అభివృద్ధి బోర్డుని ఒక దాన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా కొడాలి నానిని నియమించాలని జగన్ అనుకున్నారు. కొడాలి నాని జగన్ అంటే చాలా అభిమానం చూపిస్తారు. ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన జగన్ని ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకోరు.

ఇక కమ్మలలో ఆయన సరిసాటి నేత కూడా మరొకరు లేకపోవడంతో ఆయన మంత్రి పదవి కంటిన్యూ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చిత్రంగా కొడాలిని తప్పించేశారు. దాంతో ఆయనతో పాటు అంతా షాక్ అయ్యారు. కొడాలి నానిని తీసేయడంతో జగన్ మంత్రివర్గంలో కమ్మలు లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. దాంతో దాని మీద పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగడంతో కొడాలి నానికి వేరే కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని అంతా అనుకున్నారు.

అలా ముందుకు వచ్చిందే రాష్ట్ర అభివృద్ధి బోర్డు చైర్మన్ పదవి. అయితే ఈ పదవి కోసం జగన్ నానితో మొదట్లోనే సంప్రదింపులు జరిపారని అంటున్నారు. అయితే నాని మాత్రం తనకు ఏ పదవీ అక్కరలేదని తాను గుడివాడ ఎమ్మెల్యేగానే ఉండిపోతాను అని చెప్పారని అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి పోవడం తో కొన్నాళ్ళ పాటు బాధ పడ్డారని ఇపుడు ఆయన సర్దుకుపోయారని అంటున్నారు.

అయితే కొడాలి నానితో ముడిపెట్టి మాజీ మంత్రులు అందరికీ క్యాబినేట్ ర్యాంక్ కలిగిన పదవులు ఇస్తామని నాడు పార్టీ హామీ ఇచ్చిందని అంటున్నారు. నాని నుంచే రివర్స్ లో జవాబు రావడంతో అధినాయకత్వం ఆ ప్రతిపాదన మానుకుంది అని అంటున్నారు. దాంతో కొడాలి నాని విషయం ఎలా ఉన్నా తమకు పదవి నోటి దాకా వచ్చి పోయింది అన్న బాధ అయితే చాలా మంది సీనియర్లలో ఉంది అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి బోర్డుని కనుక ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా జిల్లా బోర్డు పదవులు కూడా దండీగా వస్తాయని అంతా ఆశించారు.

ఇప్పటికే పదమూడు జిల్లాలు కాస్తా ఇరవై ఆరుగా పెరిగాయి. దాంతో చాలా పదవులు వచ్చేవి అన్న ఆలోచన అయితే పార్టీ వారిలో ఉంది. మరి కొడాలి నాని నో చెప్పడంతోనే ఇదంతా ఆగిందా లేక హై కమాండ్ కి మొదట్లో ఉన్న ఆలోచన కాస్తా మారిందా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి చూస్తే నాని నో చెప్పారని అని కాదు కానీ మొత్తానికి భారీ ఎత్తున జరగాల్సిన పదవుల పందేరం మాత్రం అలా ఆగిపోయింది.

దీంతో మాజీ మంత్రులు మాత్రం తెగ ఫీల్ అవుతున్నారుట. ఎన్నికలకు మరో ఏడాదిన్నర టైమ్ మాత్రమే ఉన్న వేళ ఈ పదవులలో కదలిక ఉంటుందా తమకు ఆ భాగ్యం ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నారుట. ఏదేమైనా పదవులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో మాజీ మంత్రులు అయితే రగులుతున్నారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.