Begin typing your search above and press return to search.

జగన్ ఎంట్రీతో ఇసుక లెక్కలన్ని మారిపోనున్నాయ్

By:  Tupaki Desk   |   2 Oct 2019 12:18 PM GMT
జగన్ ఎంట్రీతో ఇసుక లెక్కలన్ని మారిపోనున్నాయ్
X
ఆట ఏదైనా వన్ సైడ్ గా ఉండదు. రాజకీయ క్రీడలో ఆట మొదలైతే అదెంత పసందుగా ఉంటుందో ఏపీ రాజకీయాల్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు. ఐదేళ్ల అధికారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తెలుగు తమ్ముళ్లు.. పవర్ చేజారిన తర్వాత కూడా చేస్తున్న అతి చేష్టలకు ఒక్కొక్కటిగా చెక్ చెబుతున్నారు జగన్. ఇసుక దోపిడీకి కళ్లెం వేసే ప్రయత్నంలో ఉన్న జగన్ మీద బురద జల్లేందుకు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించటం.. ఇసుక విషయంలో జగన్ వైఫల్యంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా కలర్ ఇస్తూ విష ప్రచారాన్ని మొదలెట్టారు.

దీనికి చెక్ పెట్టేలా జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇసుక తరలింపులో బలమైన కోటరీగా ఉన్న తెలుగు తమ్ముళ్లకు చెక్ చెప్పేందుకు కొత్త వ్యూహాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఏపీ సీఎం. ఇసుక రవాణాలో నిరుద్యోగ యువతను రంగంలోకి దించటంతో పాటు.. ఈ వ్యవహారంలో కీలకభూమిక పోషించేందుకు ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు.

దీని కారణంగా ఆయా వర్గాల వారికి ఉపాధి కల్పించటంతో పాటు.. ఆర్థికంగా వారిని ఎదిగే అవకాశం ఇచ్చేలా జగన్ ప్లాన్ చేశారు. ఇసుక రవాణాకు అవసరమైన వాహనాల్ని సమకూర్చుకునేంత ఆర్థిక పరిస్థితి లేకపోవటంతో రుణాల మీద బ్యాంకులు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా కలెక్టర్లు.. జిల్లా ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ కారణంగా.. రానున్న రోజుల్లో ఏపీలో ఇసుక రవాణా వ్యవహారం మొత్తం మారిపోనుందని చెబుతున్నారు. ఈ కోటరీలో బలంగా పాతుకుపోయి.. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న తమ్ముళ్ల లాబీల్ని కంట్రోల్ చేయటంతో పాటు.. నిరుద్యోగ వర్గాలకు ఆర్థిక దన్ను ఉండేలా జగన్ నిర్ణయం ఉందంటున్నారు. చౌకగా ఇసుక ప్రజలకు చేరటంతో పాటు.. కొరతకు బ్రేకులు వేసేలా జగన్ తాజా ప్లాన్ ఉందన్న మాట వినిపిస్తోంది. ఏపీ సీఎం తాజా నిర్ణయంతో తెలుగు తమ్ముళ్ల కోటరీకి బీటలు వారటం ఖాయమంటున్నారు.