Begin typing your search above and press return to search.

నీటి ప్రాజెక్టులపై కేసీఆర్, జగన్..ఎవరికి వారే `కృష్ణా` తీరే

By:  Tupaki Desk   |   3 Sep 2020 4:31 PM GMT
నీటి ప్రాజెక్టులపై కేసీఆర్, జగన్..ఎవరికి వారే `కృష్ణా` తీరే
X
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదిరి పాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది.ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీశైలం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ వాటాను వాడుకునేందుకే ఏపీ సీఎం జగన్ మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యవహారంలో ఏపీకి కేంద్రం అండగా నిలిచింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం...ఒక ప్రాజెక్టు కాదని, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా కాదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి అఫిడవిట్ సమర్పించింది. గతంలో నీటి ప్రాజెక్టులు, నీటి పంపకాల విషయంలో కొంచెం మెతకగా కనిపించిన ఏపీ సీఎం జగన్ ఇటీవలి కాలంలో దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో రాయలసీమ కరవు నివారణ పథకం ద్వారా 14 ప్రాజెక్టుల పనులను చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడమే అందుకు నిదర్శనం. శ్రీశైలం నుంచి నీటిని వాడుకుంటూ ఈ ప్రాజెక్టులను నిర్మించబోతుండడం విశేషం.

రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా నిర్మించే 27 ప్రాజెక్టుల కోసం మౌలిక సదుపాయాలు, నిధుల సమీకరణకు ఎస్పీవీని జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోవాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం అనివార్యం. కానీ, తెలంగాణ ప్రయోజనాలకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు భంగం కలిగించేలా ఉందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచితే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో సాగు, తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాదిస్తోంది.కానీ, విభజన చట్టం ప్రకారం శ్రీశైలం నుంచి తమ వాటా నీటిని వాడుకొని తీరతామని జగన్ అంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగకుండానే అదనపు వరద నీటిని రాయలసీమకు తరలించి సీమను సస్యశ్యామలం చేస్తామంటున్నారు జగన్. మిగతా విషయాల్లో ఓ అండర్ స్టాండింగ్ తో ఉన్న కేసీఆర్, జగన్ లు ఆ నీటి ప్రాజెక్టుల విషయంలో ఎవరికి వారే కృష్ణా తీరే అన్న చందంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.