Begin typing your search above and press return to search.

మంత్రులకు తన శత్రువుల లిస్ట్ చెప్పిన జగన్!

By:  Tupaki Desk   |   17 Oct 2019 5:14 AM GMT
మంత్రులకు తన శత్రువుల లిస్ట్ చెప్పిన జగన్!
X
ఏపీలో కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంత్రుల తీరుపై నిర్మోహమాటంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కేబినెట్ లోని మంత్రులు దాదాపుగా క్లీన్ గా ఉన్నట్లే చెప్పిన ఆయన..అక్కడక్కడా కొన్ని అంశాలు తనకు వినిపిస్తున్నాయని.. అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఎవరినైనా మధ్యలో తొలగించాలంటే బాధగా ఉంటుందని.. అందుకే ముందే జాగ్రత్తగా ఉండాలని తాను చెప్పదలుచుకున్నట్లు స్పష్టం చేశారు. ఎవరి విషయంలో అయినా తనకు సమాచారం వస్తే.. వ్యక్తిగతంగా పిలుస్తానని తేల్చేసిన జగన్.. తన శత్రవుల గురించి ఓపెన్ అయినట్లు తెలుస్తోంది.

‘‘అవినీతికి లొంగొద్దు.. ప్రలోభాలకు అస్కారం ఇవ్వొద్దు. ఫ్రెండ్లీగా చెబుతున్నా. చాలా జాగ్రత్తగా ఉండండి. మీడియా మనల్ని వాచ్ చేస్తోంది’’ అన్నట్లు సమాచారం. ఈ సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే తన శత్రువు కాదని.. పలువురు ఉన్నారంటూ వారి వివరాలు వెల్లడించటం విశేషంగా చెప్పాలి.

ఆంధ్రజ్యోతి.. ఈనాడు.. టీవీ5 లాంటి మీడియా సంస్థలతో నిరంతరం పోరాటం చేయాలని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మీడియా గమనిస్తోందన్న మాటను పదే పదే చెప్పటం ద్వారా అందరూ అలెర్ట్ గా ఉండండి.. ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేయొద్దన్న మాట జగన్ నోటి నుంచి వచ్చిన వైనం బయటకు వచ్చింది.

అంతేకాదు.. తప్పుడు కథనాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకోవటం.. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని.. అవసరమైతే ఆయా మీడియా సంస్థల మీద కేసులు పెట్టటానికి సైతం వెనుకాడొద్దన్న విషయాన్ని విస్పష్టంగా తేల్చేసినట్లుగా తెలుస్తోంది. ఓపెన్ గా ఉండటమే కాదు స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే..తానివ్వాల్సిన సందేశాన్ని సూటిగా.. ఎలాంటి సుత్తి లేకుండా ఇచ్చేసినట్లు చెప్పక తప్పదు.