Begin typing your search above and press return to search.

కోవ‌ర్టులొచ్చేస్తారేమో?..ఆందోళ‌న‌లో వైసీపీ!

By:  Tupaki Desk   |   20 Feb 2019 10:14 AM GMT
కోవ‌ర్టులొచ్చేస్తారేమో?..ఆందోళ‌న‌లో వైసీపీ!
X
ఏపీలో రాజ‌కీయ వేడి బాగానే రాజుకుంది. ఓ వారం ప‌ది రోజుల క్రితం వ‌రకు కూల్‌ గానే ఉన్న వాతావ‌ర‌ణం... టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు క్యూ క‌ట్టి మ‌రీ వైసీపీలోకి చేరుతుండ‌టంతో ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోయింది. రోజుకొక‌రు చొప్పున టీడీపీ నేత‌లు పార్టీకి రాజీనామా చేయ‌డం, ఆ వెంట‌నే వైసీపీ కేంద్ర కార్యాల‌యం లోట‌స్ పాండ్‌ లో ప్ర‌త్య‌క్ష‌మైపోవ‌డం - ఆ వెంట‌నే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారికి వైసీపీ కండువాలు కప్పేయ‌డం జ‌రిగివ‌పోయింది. ఈ క్ర‌మంలో అస‌లు వ‌ల‌స‌ల‌ను ఎలా నిలువ‌రించాలా? అన్న విష‌యంపై ఎంత గింజుకున్నా కాని ప‌రిష్కారం దొర‌క్క టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నిజంగానే ఫ్ర‌స్ట్రేష‌న్ కు గుర‌వున్నారు. ఈ ఫ్రస్ట్రేష‌న్ తో ఆరోగ్యం దెబ్బ తిన‌డం త‌ప్పించి ప్ర‌యోజ‌నం లేద‌న్న భావ‌న‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు... ఇప్పుడు కొత్త‌గా మ‌రింత మంది త‌మ పార్టీ నేత‌లు వైసీపీలోకి చేరిపోవ‌డం ఖాయమేన‌ని నిన్న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా డిప్యూటీ సీఎం క‌మ్ హోం మినిస్ట‌ర్ నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప కూడా... మ‌రో ముగ్గురు - న‌లుగురు టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోతార‌ని వ్యాఖ్యానించారు. నిన్న‌టిదాకా అగ్గి మీద గుగ్గిల‌మైన రీతిలో విరుచుకుప‌డి.. ఇప్పుడు చ‌ల్లగా చాలా కూల్ గా త‌మ పార్టీ నేత‌లు వైసీపీలోకి చేరిపోతారంటూ అటు చంద్ర‌బాబు - ఇటు రాజ‌ప్ప చెబుతున్నారంటే... అర్థ‌మేమిటి? ఇదే ప్ర‌శ్న ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను అల‌ర్ట్ చేసింద‌ని చెప్పాలి. నిజ‌మే... ఎన్నిక‌ల వేళ పెద్ద ఎత్తున పార్టీలోకి వ‌చ్చేస్తున్న నేత‌ల సంఖ్య‌ను వారి హోదాల‌ను చూసి సంతోష‌ప‌డి పార్టీ కండువాలు క‌ప్పేస్తే.... ఇక అంతే సంగ‌తులు. పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో ఎప్ప‌టికప్పుడు తీసుకునే కీల‌క నిర్ణ‌యాల‌న్నీ క్ష‌ణాల్లో వైరి వ‌ర్గాల‌కు చేరిపోతుంటాయి. మొత్తంగా ఎన్నిక‌ల్లో బిగ్ లాస్‌. దీనినే కోవ‌ర్ట్ అప‌రేష‌న్ అంటామ‌న్న విష‌యం తెలిసిందే క‌దా. ఇప్పుడు వైసీపీ నేత‌లు కూడా ఇద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్లు ఏమైనా జ‌రుగుతున్నాయా? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేయ‌డంతో పాటుగా పార్టీలోకి వచ్చి చేరుతున్న ప్ర‌తి నేత‌ను - ఆయ‌న వెంట చేరుతున్న అనుచ‌ర గ‌ణాన్ని ఒక‌టికి ప‌దిసార్లు ప‌రిశీలించుకుని మ‌రీ ముందుకు సాగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు కూడా ఇదే త‌ర‌హా కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ జ‌రిగింది. చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా ప్ర‌జారాజ్యంలోకి పంపి... ఆ పార్టీ వ్యూహాల‌న్నింటినీ ఇట్టే తెలిసేసుకుని మెగాస్టార్‌ కు పెద్ద దెబ్బే కొట్టార‌న్న వాద‌న ఉంది క‌దా. ఇప్పుడు కూడా మెగాస్టార్ వ్యూహాల‌ను ప‌సిగ‌ట్టిన మాదిరే.. త‌న‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన జ‌గ‌న్ వ్యూహాల‌ను కూడా తస్క‌రించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌కుండా ఉంటార‌ని ఏ ఒక్క‌రూ అనుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు త‌న కోవ‌ర్టుల‌ను ఇప్ప‌టికే రంగంలోకి దించే ఉంటార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ మ‌రింత‌గా జాగ్ర‌త్త పడుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కోవ‌ర్టుల‌ను గుర్తించ‌డం - పార్టీలోకి నోట ఎంట్రీ బోర్డు పెట్ట‌డం త‌దిత‌రాల‌పై ఇప్ప‌టికే పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. అయితే... ఈ దిశ‌గా ఏ మాత్రం అల‌స‌త్వంగా ఉన్నా.. జ‌రిగే న‌ష్టం మాత్రం మామూలుగా ఉండ‌ద‌న్న విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.