Begin typing your search above and press return to search.

చంద్రబాబు - జగన్‌ ల విదేశీ పర్యటన దేనికి సంకేతం

By:  Tupaki Desk   |   17 Jan 2019 3:53 PM GMT
చంద్రబాబు - జగన్‌ ల విదేశీ పర్యటన దేనికి సంకేతం
X
ఏపీలో ఎన్నికల వేడి, హడావుడి రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క రోజు కూడా రాష్ట్రం వదిలి వెళ్లేందుకు కీలక నేతలు ఇష్టపడడం లేదు. తాము రాష్ట్రంలో లేకుంటే రాజకీయం ఎలాంటి మార్పు తీసుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఎన్నికల షెడ్యూల్ కూడా ఇంకా రానప్పటికీ రేపే పోలింగ్ అన్నంతగా నేతలు హడావుడి పడుతున్నారు. ఈ క్రమంలో విదేశీ పర్యటనలనూ రద్దు చేసుకుంటున్నారు. టీడీపీ - వైసీపీ అధినేతలు చంద్రబాబు - జగన్‌ లు ఇద్దరూ తమ విదేశీ పర్యటలను వాయిదా వేసుకోవడమే దానికి ఉదాహరణ. దావోస్ పర్యటనకు వెళ్లాల్సిన చంద్రబాబు దాన్ని రద్దుచేసుకోగా వైఎస్ జగన్ కూడా తమ లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు హాజరు కావాల్సింది. ఇప్పుడు, ఆయన స్థానంలో మంత్రులు నారా లోకేష్ - యనమల రామకృష్ణుడుని పంపించాలని నిర్ణయించారు. మంత్రులతో పాటు మరో 15 మంది అధికారుల బృందాన్ని దావోస్ పంపించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక మొన్ననే పాదయాత్ర ముగించుకున్న వైఎస్ జగన్ లండన్‌ లో చదువుతున్న తన కుమార్తెను కలుసుకునేందుకు అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ అభ్యర్థుల ఎంపికపై సమీక్షించేందుకు గానూ జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. ఆయన ఈ రోజు సాయంత్రమే లండన్ వెళ్లాల్సి ఉంది.

పైగా ఇప్పుడు కేసీఆర్ కేంద్రంగా ఏపీ రాజకీయాలు సాగుతుండడం కూడా ఈ ఇద్దరి విదేశీ పర్యటనలు వాయిదా పడడానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఈ వారంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌ రావొచ్చని సమాచారం. జగన్ - కేసీఆర్‌ ల భేటీ ఉండొచ్చని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది.