Begin typing your search above and press return to search.

కాపుల‌కు అన్యాయం చేసింది ఎవ‌రు? జ‌గ‌నా? బాబా?

By:  Tupaki Desk   |   30 July 2019 9:22 AM GMT
కాపుల‌కు అన్యాయం చేసింది ఎవ‌రు?  జ‌గ‌నా?  బాబా?
X
రాష్ట్రంలో కీల‌క రాజ‌కీయ అంశం.. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్‌. ఈ విష‌యంపైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వ‌ర్గం పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తోంది. త‌మ‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని - అణ‌గారిన వ‌ర్గంగా ఉన్న త‌మ‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా తాము అధికారంలో ఉన్న‌ప్పుడు కాపుల‌కు ఎంతో చేశామ‌ని - కానీ, జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌ని - జూలై 28 కాపుల‌కు బ్లాక్ డే అని పెద్ద ఎత్తున టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మాజీ హోం శాఖ మంత్రి చిన‌రాజ‌ప్ప‌ - టీడీపీ నేత జ్యోతుల నెహ్రూలు ఏకంగా మీడియా ముందుకు వ‌చ్చి క‌న్నీటిప‌ర్యంత మ‌య్యారు.

అయితే, వాస్త‌వానికి వ‌స్తే.. జ‌గ‌న్ ఇప్పుడు చేసింది ఏమిటి? గ‌తంలో బాబు కాపుల‌కు ఒన‌గూర్చిన ప్ర‌యోజ‌నంలో నిజ‌మెంత‌? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌స్తోంది. ఒక్క‌సారి రెండు సంవ‌త్స‌రాల కింద‌ట ఏం జ‌రిగిందో తెలుసుకుందాం. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు .. వారితో 2014 ఎన్నిక‌ల్లో ఓట్లు వేయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే కాపుల‌కు అత్య‌ధికంగాఉన్న ప‌శ్చిమ గోదావ‌రి - తూర్పు గోదావ‌రి జిల్లాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. అయితే, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చానాఏళ్లు ఆయ‌న ఆ విష‌య‌మే మ‌రిచిపోయారు. ఈ క్ర‌మంలోనే కాపు ఉద్య‌మాలు తెర‌మీదికి వ‌చ్చాయి. మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలో అనేక రోజులు పెనుగులాట త‌ర్వాత క‌ర్ణాట‌క హైకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కేఎల్ మంజునాథ్ నేతృత్వంలో ఓ క‌మిటీని వేశారు.

ఏడాది పాటు అధ్య‌య‌నం చేసిన ఈ క‌మిటీ కాపుల్లోనే కాదు.. బీసీల్లోనే అణ‌గారిన వ‌ర్గాలు చాలానే ఉన్నాయ‌నే తీర్మానానికి వ‌చ్చింది. దీనిపై ఉప్పందుకున్న చంద్ర‌బాబు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ విష‌యంపై ఈ క‌మిష‌న్ ఎటూ తేల్చ‌లా లేద‌ని ఈ క‌మిష‌న్‌ లోనే విభేదాలు సృష్టించి - ఏకంగా క‌మిష‌న్ చైర్మ‌న్ ఇచ్చిన నివేద‌క‌తో సంబంధం లేకుండా స‌భ్యుల నుంచి నేరుగా ఆయ‌నే నివేదిక‌లు తెప్పించుకుని త‌న‌కు అనుకూలంగా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి అసెంబ్లీలో(ప్ర‌తి ప‌క్షం హాజ‌రు కాలేదు) తీర్మానం చేసేసి కేంద్రానికి పంపేశారు. ఇదే చంద్ర‌బాబు చేసిన తొలి త‌ప్పు! కేంద్రం అప్ప‌టికే 50 శాతం రిజర్వేష‌న్‌ కే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు ప్ర‌క‌టించినా.. తాను బీసీ రిజ‌ర్వేష‌న్‌కు ఆవ‌ల 5శాతం కాపుల‌కు ఇచ్చారు చంద్ర‌బాబు.

దీంతో చంద్ర‌బాబు పంపిన తీర్మానం కాపీని కేంద్రం తొక్కి పెట్టింది. ఇక‌, ఆ త‌ర్వాత మ‌రోసారి కాపుల నుంచి ఒత్తిడి వ‌చ్చింది. దీంతో ఏం చేయాలో అర్ధంకాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈక్రమంలో గ‌త ఎన్డీయే 1 ప్ర‌భుత్వం ఆర్థికంగా వెనుక బ‌డిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు అన్నింటిలోనూ 10% రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది. అయితే, ఈ విష‌యంలో రాష్ట్రాలు స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించుకునే స్వేచ్ఛ‌ను ఇచ్చింది. దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న చంద్ర‌బాబు దీనిలో కాపుల‌కు 5% గుండుగుత్తుగా రిజ‌ర్వేష‌న్ కేటాయించారు. ఇది కూడా న్యాయ స‌మీక్ష‌కు నిలిచేది కాద‌ని ఆయ‌న తెలియ‌ని విష‌యం కాదు. అయినా కూడా కాపుల క‌ళ్ల‌కు మ‌రోసారి గంత‌లు క‌ట్టారు.

ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన జ‌గ‌న్‌.. కాపుల‌కు గుండుగుత్తుగా 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ లో 5శాతం ఇవ్వ‌డం అస‌మంజ‌సం అని పేర్కొంటూ .. దానిని తీసివేశారు. ఫ‌లితంగా మిగిలిన అగ్ర‌వ‌ర్ణ‌ పేద‌ల‌తో క‌లిపి కాపుల‌కు కూడా ఈ ప‌ది శాతం అందుబాటులోకి తెచ్చారు. నిజానికి రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క అగ్ర‌వ‌ర్ణం వెనుక‌బ‌డి ఉంది. క‌డ‌ప‌ - అనంత‌పురంలో రెడ్డి కుల‌స్తులు ఎక్కువ‌గా ఉన్నారు. అలాంటి చోట్ల కూడా 5% రిజ‌ర్వేష‌న్‌ ను కాపుల‌కే కేటాయిస్తే. ఎలా అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. మొత్తంగా జ‌గ‌న్ ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని న్యాయ‌నిపుణులు కూడా చెబుతున్న‌ప్పుడు ఎవ‌రు ఈ వ‌ర్గానికి అన్యాయం చేసారో స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ప్పుడు.. టీడీపీ నాయ‌కుల స్వోత్క‌ర్ష‌ల‌తో ప్ర‌యోజ‌నం శూన్య‌మ‌నే వాద‌న బ‌ల‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.